పిల్లలారా, గుర్రపుడెక్కతో మూసుకుపోయిన నీటిలో పడవ నడపటము ప్రయాసమే. గుర్రపుడెక్కను తొలగించినాక పడవ వేగంగా ముందుకు వెళ్తుంది. అదే విధంగా, మనోమాలిన్యాలను జపముతో తొలగించితే ధ్యానము వేగవంతమవుతుంది.
ప్రాణాయమము సరిగా చేయకపోతే ఎంత ప్రమాదకరమో అలాంటిదే శ్రద్ధ లేకుండా నిరంతర జపము చేయటము. జపము చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వేరే ఆలోచనలను దూరంగా ఉంచాలి. రూపములోనో, మంత్రాక్షరములలోనో మనస్సుని ఏకాగ్రము చేయటానికి జాగ్రత్త తీసుకోవాలి.
పిల్లలారా, మంత్రము సదా జపించాలి. విశ్రమము లేకుండా జపించటము మనస్సుకు నేర్పించాలి. తరువాత ఏ పని చేస్తున్నప్పుడైనా మనస్సు జపమును కొనసాగిస్తుంది. సాలీడులు ఎక్కడికి వెళ్ళినా గూడు అల్లుతూనే ఉంటాయి. ఇదే విధంగా, ఏ పని చేస్తున్నప్పుడైనా మనస్సులో జపము కొనసాగించాలి.
పిల్లికి ఎంత ఆహారము పెట్టి లాలించి పెంచినా మనము అశ్రద్ధగా ఉంటే అది దొంగిలిస్తుంది. పిల్లలారా, ఇదే విధంగా మనస్సు కూడా. ఆ విధంగా ఉన్న మనస్సుని లొంగదీసుకోవటానికీ – ఏకాగ్రము చేయడానికీ మంత్రము సదా జపించాలి. నడుస్తున్నప్పుడూ కూర్చున్నప్పుడూ పని చేస్తున్నప్పుడూ అన్ని సమయాలలో మంత్రజపము తైలధారలాగా కొనసాగాలి.
పిల్లలారా, సాధన యొక్క మొదటి దశలలో రూపస్మరణతో పాటు జపము కూడా అవసరమే. రూపము స్పష్టంగా లేనట్లైతే, దాని గూర్చి చింతించవద్దు, జపము కొనసాగిస్తే చాలు. సాధనలో పురోగమిస్తున్న కొద్దీ రూపములో మనస్సు స్థిరమవుతుంది. జపము తనంతట తానే నిదానమౌతుంది.
కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. పిల్లలారా, ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు.
పిల్లలారా, పలు సహస్రనామాలను జపించవలసిన అవసరము లేదు. ఏదో ఒక్కటి చాలు. ఒక్క దానిలోనే అంతా ఉంది.
సంధ్యా సమయములో ప్రకృతి, కలుషితమైన తరంగాలతో నిండి ఉంటుంది. పగలూ రాత్రీ కలసి సమ్మేళనమవుతున్న సమయమే సంధ్య. అయితే, సాధకుడికి ధ్యానము చెయ్యటానికి ఇది తగిన సమయము. ఈ సమయములో సరైన ఏకాగ్రత పొందవచ్చు. సాధన చెయ్యకపోతే లౌకికమైన ఆలోచనలు ఎక్కువయ్యి పైకి వస్తాయి. అందుకే, సంధ్యా సమయములో కీర్తనలు బిగ్గరగా పాడాలని చెప్తారు. దీని వలన వాతావరణము కూడా శుద్ధి అవుతుంది.
వాతావరణము శబ్దకోలాహలములతో నిండి ఉండుట వలన కలికాలములో ఏకాగ్రత పొందటానికి ధ్యానము కన్నా ఉత్తమమైనది కీర్తనమే. ధ్యానానికి నిశ్శబ్దమైన వాతావరణం అవసరము. బిగ్గరగా కీర్తనలు పాడటము ద్వారా ఇతర శబ్దాలను జయించగలము కదా? ఏకాగ్రతకు అవతల ఒకటున్నది. అదే ధ్యానము. కీర్తనము – ఏకాగ్రత – ధ్యానము, ఇదే క్రమము. పిల్లలారా, నిరాటంకమైన భగవదాలోచనే ధ్యానము.
ఏకాగ్రతతో కీర్తనలు పాడకపోయినట్లైతే జీవశక్తి వృధా అవ్వటము తప్పించి ఇతర ప్రయోజనమేమీ లేదు. ఏకాగ్రతతో పాడితే; పాడినవారికి మేలు, వారి ఏకాగ్రత వలన ప్రకృతికి కూడా మేలు కలుగుతుంది. పైగా విన్నవారికి కూడా మేలు కలుగుతుంది. తరువాత ఈ కీర్తనలు వారి మనస్సును మేల్కొల్పడానికి సహాయము చేస్తాయి.
పిల్లలారా, మనస్సు చంచలంగా అనిపిస్తే మంత్రము జపించాలి, లేకపోతే చంచలత్వం అధికమవుతుంది. నిశ్చలత దొరకని మనస్సు దానిని తిరిగి పొందటానికి వేరొకదానిని ఆశ్రయిస్తుంది. దాని వలన కూడా ఫలితము దొరకనప్పుడు, మరొకదానిని ఆశ్రయిస్తుంది. ఈ బాహ్యవస్తువులలో దేనికీ నిశ్చలత ఇవ్వటము సాధ్యము కాదు. కానీ భగవంతుని స్మరణమూ, మంత్ర జపమూ చేస్తే నిశ్చలత్వం తిరిగి పొందటం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక గ్రంథ పారాయణము కూడా మంచిదే.
చిన్నపిల్లలు పూసల పలక ఉపయోగించి అంకెలు లెక్కబెట్టటము నేర్చుకుంటారు. దీని ద్వారా వాళ్ళు త్వరగా అంకెలు నేర్చుకోగలుగుతారు. అదే విధంగా, మొదట్లో మనస్సును మన అధీనములో ఉంచుకోవటానికి జపమాలను ఉపయోగించటము మంచిది. తరువాత, మాల లేకుండా కూడా జపము చేయవచ్చు. జపము నిరంతరంగా చేస్తే, అది స్వభావము అయ్యి తీరుతుంది. నిద్రపోతున్న సమయములో కూడా మనకు తెలియకుండానే జపము కొనసాగుతూ ఉంటుంది.
పిల్లలారా, సాయంసంధ్య వేళలో వెలుగుతున్న నూనె దీపము ముందు కూర్చుని కీర్తనలు పాడటము మంచిది. నూనెలో కాలిన వత్తి నుండి వచ్చిన పొగ ఒక సిద్ధౌషధము. ఆ పొగ మన శరీరాన్ని మరియు వాతావరణాన్ని కూడా పరిశుద్ధం చేస్తుంది.