తుఫానులో మహావృక్షాలు వేళ్ళతో సహా పెకలించుకుపోతాయి. కట్టడాలు కూలిపోతాయి. కానీ ఎంత పెద్ద తుఫానైనా ఒక గడ్డిపోచను ఏమీ చేయలేదు. పిల్లలారా, అణకువ యొక్క మహత్వమిదే.

ఇతరుల ముందు తల వంచడమనేది దుర్బలత కాదు. ఒక గడ్డిపోచ ముందు కూడా తల వంచగలిగే ఔన్నత్యము మనలో పెంపొందాలి. ఒకడు స్నానం చేయడానికి నదిలోకి దిగి, ‘నేను నదికి తల వంచను, నేను మునగను’ అని అంటే అతడి శరీరంలోని మలినాలు పోవు. ఆధ్యాత్మిక జీవి ఇతరుల ముందు తల వంచను అని చెప్పటము వలన అతడజ్ఞానమే నశించదు.

ప్రపంచాన్ని మొత్తము భస్మీకరించడానికి ఒక్క మీట నొక్కితే చాలు అని చెప్పి మనిషి అహంకరిస్తున్నాడు. మీట నొక్కాలంటే చెయ్యి చలించాలి. దానికి కారణమైన శక్తిని గురించి అతడు ఆలోచించట్లేదు.

ప్రపంచాన్ని జయించానని మనిషి అంటున్నాడు. అతడు తన ఆరికాలి క్రింద ఉన్న ఇసుక రేణువులను కూడా లెక్కించలేడు. అటువంటి అల్పులు ప్రపంచాన్ని జయించామని అంటున్నారు.

ఊరికే నడిచి వస్తున్న సమయాన ఒకతను మనపై కోపగించాడనుకోండి. ఆ సమయంలో కూడా ‘ఇది నన్ను పరీక్షించటం కోసమే భగవంతుడి లీల’ అని తెలుసుకొని, కోపగించుకున్నవాడికి నమస్కరించే భావము సాధకుడు పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే ధ్యానము యొక్క ఫలము పొందినట్లుగా చెప్పవచ్చు.

పిల్లలారా, మొదలంటా నరికి తనను నాశనము చేస్తున్న సమయములో కూడా, నరుకుతున్నవాడికి వృక్షము నీడనిస్తుంది. ఆధ్యాత్మిక జీవి కూడా ఇదే విధంగా ఉండాలి. తనను బాధిస్తున్న వారికి కూడా మంచి జరగాలని కోరుకునే వాడు మాత్రమే ఆధ్యాత్మిక జీవి అవ్వగలడు.