21 జూలై 2015, పారిస్ , ఫ్రాన్స్ లో జరిగిన Climatic Conscience శిఖాగ్రసమావేశానికి పంపిన అమ్మయొక్క వీడియో సందేశము.
ప్రేమ స్వరూపులు ఆత్మస్వరూపులు అయిన అందరికీ నమస్కారములు.
కొంతమంది పిల్లలు అంటారు “అమ్మా, తల తిరుగుతోంది, పడిపోతున్నాను, కుదురు తప్పుతోంది” అని అంటారు. దానికి కారణం చెవులలోని కణములకు స్థానచలనం కలిగి అలజడి వల్ల ఇలా జరుగుతోంది. నేడు మన ప్రకృతికి కలిగిన భంగపాటు ఇంచుమించు ఇలాంటిదే. అందు వల్ల ఒక తుపాకికి ముందు నిల్చున్నప్పుడు కలిగే జాగరూకత, ఎఱుక మనకు ఉండాలి.
నా చిన్న తనంలో జరిగిన ఒక అనుభవాన్ని పంచుకుంటాను.
నేను ఒక పేద బేస్త గ్రామంలో పెరిగాను. అక్కడ జనం రోజువారి వేతనాల మీద జీవించేవారు. ప్రతిరోజూ మూడు పూటలా తినటానికి ఉండేది కాదు. నేను ఇంటి ఆవులకు ఆహార వ్యర్థాలను ఇవ్వటానికి ఇరుగు పొరుగు ఇళ్ళకు వెళ్ళి ఆహార వ్యర్థాలను సేకరించేదానిని. ఒక రోజు దీని కొరకు నేను ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ పదకొండుమంది పిల్లలున్నారు. వారందరూ తల్లి ఒడిలో వాలి ఉన్నారు.
అప్పుడా తల్లి “ నిన్న ఏమీ వండలేదు అందువల్ల కాయకూరల తొక్కులేమీ లేవు అమ్మాయి” అని నాతో అన్నారు.
అప్పుడు నేను అడిగాను, “ఎవరివద్ద అయినా అప్పు తీసుకుని పిల్లలకు వండిపెట్ట కూడదా ?”
ఆమె అన్నది, “పిల్లల తండ్రి పనికి వెళ్ళి, ఏమీ దొరకకుండా తిరిగి వచ్చారు. దాని తరువాత పది కిలోమీటర్ల దూరాన ఉన్న బంధువుల ఇంటికి డబ్బు అప్పు అడగటానికి నడిచి వెళ్ళారు. కానీ గిట్టలేదు. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అయింది. పౌర్ణమి రాత్రి అవటం వల్ల సముద్రతీరాన వస్తున్నప్పుడు తాబేలు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టడం చూసారు. తాబేలు గుడ్లు పెట్టి తిరిగి పోయిన తరువాత, కొన్ని గుడ్లను తీసుకెళ్లి ఉడికించి, రెండు మూడు గుడ్లు చొప్పున పిల్లలకు పంచిపెట్టారు.”
అప్పుడు వారిలో ఒక అబ్బాయి అడిగాడు, “ గుడ్లన్నిటినీ ఎందుకు తీసుకురాలేదు నాన్నా ? అప్పుడు ఎక్కువ తినగలిగేవారము కదా.”
అప్పుడు ఆ తండ్రి అబ్బాయితో అన్నడు “అబ్బాయి, మీరందరూ చనిపోతే నేను ఎంత బాధపడతాను. అన్ని గుడ్లను తీసుకువెళితే, తాబేలుకూడా అలాగే బాధ పడుతుంది. అంతే కాదు దాని పరంపర కొనసాగితేనే కదా, మనకు ఆకలి తీరని సందర్భాలలో కొంచమైనా దొరికేది.”
ఇక్కడ మనం గమనించగలిగేది ఏమిటంటే తాను ఆకలితో ఉన్నప్పటికీ, ఇతరుల బాధను గుర్తించగలుగుతున్నాడు. తాను బాధ పడుతున్నప్పటికీ, ఇతరుల పట్ల కారుణ్యమును చూపించగలుగుతున్నాడు. అలాటి మనోభావమే మన పూర్వీకులకు ఉండేది. కానీ ఇప్పుడు, తాబేలునూ అన్నిటినీ ధనార్జనే లక్ష్యంగా ఎగుమతి చేస్తున్నాము.
నేడు మానవుడు ఒక చెట్టును నరికినప్పుడు, తన శవపేటికను తానే తయారుచేసుకుంటున్నాడు. చెట్లను అమితముగా నరికేశాము. ఇలాంటప్పుడు ఒక చెట్టును నరికేసి, ఇంకొక మొక్కను నాటితే సరిపోదు. ఇలాంటి స్థితిలో కనీసం నలభై యాభై చెట్లనైనా నాటాలి. నేడు పర్యావరణ కాలుష్యమువల్ల ఐదు లక్షలమందికి పైగా క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.
పూర్వపు రోజులలో, మాకు గాయం ఏర్పడితే, ఆవుపేడను పెట్టి గాయాన్ని నయంచేసేవారు. కానీ ఇప్పుడు గాయానికి పేడ సోకితే సెప్టిక్ అవుతోంది. ఆరోజులలో ఔషధముగా ఉండినది ఇప్పుడు విషముగా మారింది.
ప్రపంచంలో ఏదికూడా నిస్సారమైనది కాదు. ఒక విమానము యొక్క ఇంజిన్ పనిచేయకపోయినా ఎగరలేదు. స్క్రూ లేక పోయినా ఎగరలేదు. అన్నిటికీ దానికంటూ ఒక స్థానముంది. తేనెటీగలు పుష్పసంపర్కం చేయటం వల్లనే మనకు పండ్లు కాయకూరలు దొరుకుతున్నాయి. ఆ తేనెటీగలు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలిగేవి. కానీ ఇప్పుడు, పువ్వులకు ఎక్కువగా విష మందులు జల్లటం వల్ల, వాటి జ్ఞాపక శక్తి నశించి తిరిగి తమ తేనెగూడ్లకు తిరిగి రాలేకపోతున్నాయి. అందువల్ల పూల చెట్లు, తేనెటీగల గూడ్లు, హెచ్చుసంఖ్యలో కావాలి. లక్షలకొద్ది అమ్మ పిల్లలు ఇలా చేస్తున్నారు. ఐనప్పటికీ, ఇంకా అధికంగా తేనెటీగల గూడ్లను, పూలచెట్లను, పెంచడానికి చాలామంది శ్రద్దతో పూనుకోవాలి.
మనలను కన్న తల్లి ఐదు ఏళ్ళ వరకే ఒడిలో కూర్చోపెట్టుకుంటుంది. భూమాత అలా కాదు. జీవితాంతము తొక్కటానికీ, ఉమ్మటానికి , గుద్దటానికి అనుమతించిన తల్లి. జీవితకాలంమంతయు మనలను పోషించి పెంచుతున్న అమ్మ. అన్నిటికీ పోషక శక్తి అయిన అమ్మ. ఆ అమ్మ పట్ల ఉన్న బాధ్యతను మనం మరచిపోకూడదు.
ఒక భవనముయొక్క మొదటి అంతస్తు కాలినప్పుడు, “ అయ్యో, కాపాడండి, రక్షించండి.” అని ఇలా విన్న కేకలకు, పదో అంతస్తున ఉన్న మనిషి “ అది అతని సమస్య. నా సమస్య కాదు, అని అనుకుంటే చివరికి అది తన సమస్యగా మారుతుంది. దీనిని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. నేటి అతని సమస్యే రేపటి నా సమస్యగా మారుతుందనే వివేకం మనలో కలిగి, మనం మారాలి.
ప్రపంచమునకు ఒక లయ ఉంది. ఈ విశ్వానికి దానిలోని జీవరాశులకు మద్య అభేద్యమైన బంధం ఉంది. పరస్పరాలంబనము ఉన్న నెట్వర్క్ లాంటిది ఈ ప్రపంచము. నాలుగుమంది కలిసి పట్టుకున్న ఒక వలలో చలనం సంభవించినప్పుడు అది అన్ని చోట్లా ప్రతిధ్వనిస్తుంది. అందుచేత మనం తెలిసో తెలియకో, ఒంటరిగానో సమూహముగానో చేసే అన్ని కర్మలూ, ప్రపంచము అన్న వలయొక్క నలుమూలలా ప్రతిధ్వనిస్తుంది. వారు మారిన తరువాత నేను మారుతాను అని అనుకుంటే సరిపోదు. వారు మారకపోయినా మనం మారితే వారిలోనూ మార్పును తీసుకురావచ్చు. మొదట మనం ఏమి చెయ్యగలము అని చూడాలి.
మదర్స్ డే అలగే ఫాదర్స్ డే చాలా ఆడంబరముగా జరుపుకున్నట్లు ప్రకృతిని ఆదరించటానికి , ఆరాధించటానికీ మనకు ఒక రోజు ఉండాలి. ఆరోజు ప్రపంచంలోని అందరూ ఖచ్చితంగా చెట్ల మొలకలను నాటాలి.
ఇంతకు ముందు ఇల్లు కట్టుకున్నవారు, ఇంకొక ఇల్లు 3000 చ. అడుగులులో కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు, 1500 చ. అడుగులులో ఇల్లు కట్టుకోవాలి. రెండువేల చ. అడుగులులో ఇల్లు కట్టుకోవలని అనుకున్నవారు వెయ్యి చ. అడుగులులో కట్టుకోవటానికి ప్రయత్నించాలి. వెయ్యి చ. అడుగులులో కట్టాలని అనుకున్నవారు ఐదు వందల చ. అడుగులులో కట్టాలి. ఇలా చేయటం వల్ల మనం చెట్లను, నీళ్ళను, విద్యుత్ శక్తిని ఇతర వనరులను పొదుపుచేయవచ్చు . అన్ని చెట్లను మనం నరకనక్కర్లేదు.
car pooling ద్వారా మనం ఇంధనమును పొదుపుచేయవచ్చు .
ఇలా ఒక్కొక్క అడుగున మార్పు తీసుకురాగలిగితే భూమియొక్క విషయంలో కొంచెం మార్పును తీసుకురావటానికి వీలౌతుంది. వెయ్యి డాలర్ల పెన్ తో వ్రాయచ్చు వంద డాలర్ల పెన్ తోనూ వ్రాయచ్చు. ఏ కలముతో వ్రాసినా అక్షరాలు వస్తాయి. ఆడంబరాన్ని తొలగించినట్లైతే మనకు కావలసినది తీసుకుని ఇతరులకు సహాయపడవచ్చు.
ఒక పెద్ద తటాకము మలినమై ఉందనుకోండి. దానిని నేను ఒంటరిగా ఏలా శుభ్రం చేయటానికి కుదురుతుంది అని విచారించి దుఃఖించి వెనుతిరగకూడరదు. మన వల్ల అయినది శుభ్రం చేయాలి. దానిని చూసి పక్క వ్యక్తి శుభ్రం చేస్తాడు. దానిని చూసి ఇంకో వ్యక్తి వస్తాడు. అలా శుభ్రమయి శుభ్రమయి తటాకం అంతా శుభ్రం అవుతుంది. అందుచేత వెనుతిరగటము అన్నది కాదు, పరిశ్రమనే కావాలి.
carpool పెట్టడము, తేనెటీగలను పెంచటము, చెట్లను నాటటము, పర్యావరణమును శుభ్రపరచటము, ప్రకృతిని మాలిన్యముక్తంగా చేయటము, కాయకూరల మొలకలను నాటటము, ఇవన్నీ ఎన్నో ఏళ్ళ క్రితం అమ్మ చెప్పారు. దానిని పిల్లలు ఆచరిస్తున్నారు. ఇంకొంచెం జాగ్రత్తగా అందరూ ఒక్కటైనట్లైతే ఈ భూమిని మనము స్వర్గముగా మార్చటానికి సాధ్యమౌతుంది. దానికి కృప అందరినీ అనుగ్రహించని అని పరమాత్మను ప్రార్థిస్తున్నాను.
**********
పారిస్ లో జరిగిన Climatic Conscience శిఖాగ్రసమావేశంలో అమ్మను ఫ్రెన్చ్ ప్రెసిడన్ట్ François Hollande ఒక ప్రత్యేక దూత ద్వారా ఆహ్వానింపబడినప్పటికీ, ముందుగా నిర్ణయింపబడ్డ అమేరికా పర్యటన కార్యక్రమంలో ఉన్నందువల్ల అమ్మకు పాల్గొనటానికి వీలుకాలేదు. అమ్మయొక్క ప్రతినిధిగా మాతా అమృతానందమయీ ఆశ్రమం యొక్క ఉపాద్యక్షుడైన స్వామీ అమృతస్వరూపానందపురి, అమ్మ సందేశమును అందించారు.
ఈ సమావేశములో కోన్స్టాన్టినోపుల్ ఆర్చ్ బిషప్ బర్తలోమియో-I, ఐక్యరాజ్యసమితి పూర్వ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, నోబల్ సమ్మాన గ్రహీత డా. ముహమ్మద్ యూనిస్, ప్రపంచ ప్రఖ్యాత సినీ నటుడు, సోషియల్ ఆక్టివిస్ట్ అయిన ఆర్నోళ్డ్ షోర్సేనగర్, మరియు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక, రాజకీయ, సాంఘిక నాయకులు, ఐక్యరాజ్యసమితియొక్క వివిధ సమస్థలనుండి విచ్చేసిన ప్రతినిధులు మొదలైనవారు పాల్గొన్నారు. వారందరూ ఏక కంఠంతో ప్రకృతి రక్షణకోసం, శక్తివంతమైన, ఫలప్రదమైన తీర్మానాలు రూపకల్పన చెయ్యాలని, అంతర్జాతీయపరంగా ఒక నివేదన తీసుకురావసిన అత్యవసర ఆవశ్యం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. డిసంబర్ నెల పారిస్ లో జరగబోవు మరో శిఖరాగ్రసమావేశం Cop21 మునుపే ఈ నిర్ణయాలు రూపకల్పన చెయ్యాలని అందరూ సంకల్పించారు.