పిల్లలారా, నాలుక యొక్క రుచిని విడిచిపెట్టకపోతే హృదయం యొక్క రుచిని అనుభవించలేము.

 

ఈ ఆహారం తినాలి, ఇది తినకూడదు అని ఖచ్చితంగా చెప్పటం సాధ్యం కాదు. వాతావరణములోని మార్పులననుసరించి ఆహారానికి మన పైన ఉన్న ప్రభావం కూడా మారుతుంటుంది. ఇక్కడ (దక్షిణ భారతదేశంలో) తినకూడనిది హిమాలయాల్లో మంచిదవుతుంది.

ఆహారం తినడానికి వచ్చి కూర్చున్నప్పుడు భగవంతుని స్మరించిన తరువాతే తినాలి. అందుకే తినడానికి ముందు మంత్రం జపించేది.  ఆహారం ముందు ఉన్నప్పుడే మన సహనాన్ని పరీక్షించటానికి సరైన సమయం.

తపస్వికి ఆహారం కోసము వెతుకుతూ తిరుగవలసిన అవసరం లేదు. సాలీడు గూడు అల్లి అక్కడే కూర్చుంటుంది. ఆహారం కోసం వెతుక్కుంటూ ఎక్కడికీ వెళ్ళదు.దానికి కావలసిన ప్రాణులు ఆ గూడులో చిక్కుకుంటాయి. అదే విధంగా, తపస్వికి అవసరమైన ఆహారం కూడా ఈశ్వరుని ద్వారా అతని దగ్గరకే వచ్చి చేరుతుంది. కానీ, అతను భగవంతునికి పూర్తిగా శరణాగతుడైన వాడై ఉండాలి.

ఆహారము మన స్వభావంపై ఎంతో ప్రభావము చూపుతుంది. పాచిపోయిన ఆహారా పదార్ధాలు తమోగుణాన్ని పెంచుతాయి.

ఒక సాధకుడు మొదట్లో ఆహార సంబంధమైన విషయాలలో నిగ్రహం పాటించాలి.  నియంత్రణ లేని ఆహారక్రమము చెడ్డ లక్షణాలను పెంచుతుంది. విత్తనాలు చల్లిన తరువాత కోళ్ళూ, కాకులూ ఏరుకుని తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. అది పెరిగి చెట్టు అయిన తరువాత దాని మీద ఏ పక్షి అయినా కూర్చోవచ్చు లేదా గూడు కట్టుకోవచ్చు. అందుకే ఇప్పటి నుండే ఆహారాన్ని నియంత్రిస్తూ సాధన చెయ్యాలి. తరువాత, కారము, పులుపు, చేప, మాంసము లాంటివి  ఏవైనా ఫర్వాలేదు; అది మీ మీద ప్రభావము చూపదు. పిల్లలారా, అమ్మ ఈ రోజు ఇలా చెప్పారని, మీరు రేపు ఆ విధంగా చెయ్యకూడదు. లోకానికి ఆదర్శంగా జీవించాలి. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. కామెర్ల వ్యాధిగ్రస్థుడైన వ్యక్తి ముందు మనము కారము పులుపు వేసుకోగూడదు. మనకు రోగము లేకపోయినప్పటికీ, ఇతరులను బాగుచేయటానికి నిగ్రహం అవసరము..

టీ త్రాగుట మానటము, పొగ త్రాగుట మానటము ఇవన్నీ చాలా సులభమని కొందరంటారు. ఈ సులభమైన వాటిని కూడా మానలేని వారు, మనస్సుని ఎలా నిగ్రహించుకోగలరు? అందుకే మొదట ఈ సులభమైన వాటిని నియంత్రించాలి. చిన్న నదులను కూడా దాటలేనివారు మహాసముద్రాన్ని ఎలా దాటగలరు?

మొదట్లో ఒక సాధకుడు దుకాణాల నుండి ఏమీ తినగూడదు. దుకాణదారుడు ఒక్కో వస్తువుని తీసేటప్పుడు ఎంత ఎక్కువ లాభము పొందాలని మాత్రం ఆలోచన ఉంటుంది. టీ తయారు చేసేటప్పుడు, ‘ఇంత కావాలా, ఇన్ని పాలు అవసరమా, పంచదార ఎందుకు తగ్గించకూడదు’ ఇలా, ‘కొంచెం కొంచెం’ అనే ఆలోచనల తీరులో ఉంటాడతను. ఈ ఆలోచనా తరంగాలు ఆహారం తినే సాధకునిపై కూడా ప్రభావం చూపుతాయి.

ఒక సన్యాసి ఉండేవాడు. అతడు వార్తాపత్రికలు చదివేవాడు కాదు. కానీ, వార్తాపత్రిక చదవాలనే గాఢమైన  కోరిక అతనిలో కలిగింది. ఆ తరువాత, వార్తాపత్రికా, దానిలోని వార్తలూ స్వప్నంలో కనిపించటము మొదలయ్యింది. దీనికి కారణమేమిటా అని విచారణ చేస్తే, పనివాడు వంట చేస్తూ వార్తాపత్రిక చదువుతున్నాడని తేలింది. అతడికి శ్రద్ధ వంట చేయడంపై లేదు, వార్తాపత్రిక చదవటం పైనే ఉంది. వంటవాడి ఆలోచనా తీరు సన్యాసిపై కూడా ప్రభావం చూపింది.

గొంతు వరకు వచ్చేదాకా ఆహారం తినగూడదు. కడుపులో సగభాగం ఆహారానికి, పావుభాగం నీటికి, మిగిలినది వాయు చలనానికి వదలాలి. ఆహారం తక్కువగా తిన్నకొద్దీ మనోనిగ్రహం ఎక్కువవుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోకూడదు. ధ్యానం కూడా చేయకూడదు. అలా చేస్తే సరిగా జీర్ణమవ్వదు.

భగవంతుని పట్ల గాఢమైన ప్రేమ కలిగిందంటే, అది జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిలాంటిది. అతడికి రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి ఉండదు. తీపిదైనప్పప్పటికీ చేదుగా అనిపిస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ కలిగినప్పుడు కూడా ఇలానే ఉంటుంది. అహారము పట్ల ఉన్న కోరిక తనంతట తానే తగ్గిపోతుంది.