అమృత కుటీరం

పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టి ఇస్తున్న “అమృత కుటీరం” గృహదాన పధకాన్ని మఠం 1990 లో ప్రారంభించింది. ఇప్పుడు దేశమంతటా (కేరళ, తమిళనాడు, కర్నాటక , ఆంధ్ర, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో) ఒక లక్ష అమృత కుటీరాలు కట్టి ఇచ్చే పధకం నడుస్తున్నది. భుజ్ లో భూకంపం వచ్చిన తరువాత దత్తు తీసుకున్న 3 గ్రామాలలో కట్టి ఇచ్చిన 1200 ఇళ్ళు దీనిలో చేరుతాయి.

అమృత నిధి
భారతదేశమంతటా సుమారు ఒక లక్ష వితంతువులు మరియు వికలాంగులూ అయిన పేదవారికి ప్రతి నెలా పింఛను ఇచ్చే పథకమే “అమృత నిధి”. కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్న అర్హత గల వారిని మఠం యొక్క సాధ్యతను అనుసరించి ప్రతి నెలా కొత్తగా అమృత నిధి పథకంలో చేరుస్తారు.

అనాధ శరణాలయం
దాదాపు 500 మంది పిల్లలకు విద్యాభ్యాసం, ఆరోగ్య సంరక్షణ, సాంప్రదాయిక విద్యా వికాసము ఇస్తున్నది పారిప్పల్లిలో ఉన్న అనాధ శరణాలయం “అమృత నికేతన్”.

అమృత నీతి ప్రతిష్ఠాన్
పేదలకు ఉచిత న్యాయ సహకారాన్ని అందిస్తున్నదే “అమృత నీతి ప్రతిష్ఠాన్”.

వృద్ధాశ్రామం
తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలో వృద్ధాశ్రమాలను కూడా నడుపుతున్నారు.

వివాహాలు
ప్రతి సంవత్సరం కొన్ని వందల మందికి ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించబడుతున్నాయి. దానికై వారికి పట్టుబట్టలు, ఆభరణాలు, పెళ్ళి సంతర్పణ వంటి వాటికి కావలసిన ఖర్చు ఆశ్రమం భరిస్తున్నది.

జన శిక్షణ సంస్థాన్
శివకాశిలో, ఇడుక్కి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మఠం నిర్వాహణలో నడుస్తున్న స్వయం ఉపాధి (సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్) కలిగించే శిక్షణను ఇచ్చే పధకమే “జన శిక్షణ సంస్థాన్”.

ఆయుధ్
మాతా అమృతానందమయి మఠం యొక్క యువ విభాగమే “అమృత యువ ధర్మ ధార” (ఆయుధ్).

గ్రీన్ ఫ్రెండ్స్
పర్యావరణ సంరక్షణకై మఠం రూపొందించిన పధకమే “హరిత మిత్రులు” (గ్రీన్ ఫ్రెండ్స్). సంవత్సరకాలమంతా లక్షల సంఖ్యలో వృక్షాలను నాటడం మరియు వాటి సంరక్షణ చెయ్యడమే కాక పర్యావరము సంరక్షణ గురించి బోధనా కార్యక్రమాలు లోకమంతటా జరుగుతూ వస్తున్నాయి.