నూతన సంవత్సరం, ఆదివారం, 00:10ని״కి, 1 జనవరి 2012 – అమృతపురిలో

“మన జీవితాలు మరియు సకల ప్రాణికోటి జీవితాలు మంగళప్రదమవ్వాలని ఈ సందర్భంగా అమ్మ ప్రార్థన. అమ్మ అందరి పిల్లల  జీవితాలలోనూ మరియు ప్రపంచంలోనూ, సానుకూల మార్పులు తీసుకువచ్చే దివ్య శక్తి ఉదయించుగాక. ఈ నూతన సంవత్సరము ఒక నవ్య వ్యక్తి, ఒక నవ్య సమాజము జన్మించటానికి దారి తీయాలని అమ్మ ప్రార్థన.”

“నూతన సంవత్సరమనేది ఒక మంచి అవకాశం. జనులందరూ తమ గత సంవత్సరములో చేసిన తప్పులని సరిదిద్దుకొని వారి సోమరితనాన్ని అధిగమించటానికి ప్రయత్నము చేసే ఒక శుభ సందర్భము నూతన సంవత్సరము. ఒక కొత్త శుభారంభంలో ఆసక్తి, ఉత్సాహము మేల్కొంటాయి. ఎంతో మంది కొత్త సంవత్సరంలో ఎన్నో నూతన సంకల్పాలు చేస్తారు. కొత్త అలవాట్లను చేసుకునేందుకు కృషి చేస్తారు. చాలా మంది డైరీ వ్రాయడము మొదలుపెడతారు. కానీ, ఆరు నెలల తరువాత ఆ డైరీ తెరిచి చూస్తే, ఒకటి రెండు వారాల పాటు మాత్రమే డైరీ నింపి ఉండటం చూస్తాము – మహా అయితే మూడు నెలల వరకు వ్రాస్తారు. ఎందరో జీవితాల్లో మనము ఇదే చూస్తాము. మనలో మంచి పనులను పట్టుదలతో సాధించే సామర్థ్యము లేదు. నిరంతర ప్రయత్నమనేది ఎప్పుడూ ప్రశంసనీయమే. ఉదాహరణకు, ఎవరైనా సైన్యంలో గానీ లేదా ఏ ఇతర సంస్థలో గానీ అనేక సంవత్సరాల పాటు సేవ చేస్తే, వారు ఆ సంస్థ ద్వారా సన్మానాన్ని పొందుతారు. కానీ మనము ఈ పట్టుదల, సంకల్పమనేది మనము తీసుకున్న వాగ్దానాలలో మంచి పనులలో స్థిరంగా ఉంచుకోలేము. మనలో చాలా మంది యోగాభ్యాసము మొదలుపెడతారు, కానీ రెండు మూడు రోజుల తరువాత ఆపేస్తారు. కొంత మంది చిన్న పిల్లలు ఎంతో ఉత్సాహంగా ధ్యానం చేయడము మొదలుపెడతారు, కానీ రెండు మూడు నెలల తరువాత ఆపేస్తారు.”

“సత్‍కర్మలు చెయ్యటంలో మనము ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మనస్సు ప్రతీ క్షణము మారుతుంటుంది. మంచిగా మాట్లాడటానికి, మంచి పనులు చేయటానికి, ధైర్యము సహనము కరుణ వంటివి అభ్యాసము చేయటానికి నిరంతర జాగరూకత, విశేష కృషి అవసరము. నెమ్మది నెమ్మదిగా ఈ పనులే అలవాటుగా మారి, చివరికి స్వతఃసిద్ధంగా మన స్వభావంగా మారుతాయి. ఇటువంటి అలవాట్లే జీవితంలో విజయాన్ని చేకూరుస్తాయి.”

“జీవితమనే కాగితంపై మన ఇచ్ఛానుసారము ఏమైనా వ్రాసుకునే స్వాతంత్ర్యం మానవులకే ఇవ్వబడింది. పరమాత్ముడు మనకు కాగితము కలము ఇచ్చాడు, కానీ, ఏమి వ్రాయాలో తాను చెప్పడు. ఎలా వ్రాయలి అన్నది మాత్రము ఆయన మనకు నేర్పిస్తాడు. అప్పుడప్పుడూ సంకేతాలు ఇస్తూ ఉంటాడు, కానీ ఏమి వ్రాయాలి అనే నిర్ణయం మాత్రం మనకే వదిలేస్తాడు. మనకు పూర్ణ స్వాతంత్ర్యం ఉంది. మనము కోరుకుంటే, మంచితనము, ప్రేమ సౌందర్య పాత్రులుగా వ్రాయవచ్చు, లేదా చెడు, ద్వేషము, వికృతముతో కూడిన జీవితాన్నీ వ్రాసుకోవచ్చు. పరమాత్మ మనకి మంచి చెడులను రెండింటినీ తెలుసుకోగలిగేలా సూచనలు ఇస్తూ ఉంటాడు. 2011 సంవత్సరంలో మానవాళి ఇటువంటి సూచనలు ఎన్నో అందుకుంది.”

“ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక వైరుధ్యాలు మరియు ఆర్థిక సంక్షోభాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. భయము మరియు చింత అనేవి ప్రతి రోజూ తీవ్రతరమౌతూ మనుషుల మనస్సులను వేటాడుతున్నాయి. మానవుని వివేకరహిత చర్యల వలన ప్రకృతి తన సమతుల్యాన్ని కోల్పోయింది. గాలి, నీరు మరియు భూమి విషపూరితమవుతున్నాయి. ఒకప్పుడు కామధేనువుగా ఉన్న ప్రకృతి, ఇప్పుడు వట్టిపోయింది. భూమిలోని చమురు నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఆహార పదార్ధాల ఉత్పత్తి తగ్గిపోతోంది. త్రాగు నీరు మరియు స్వచ్ఛమైన గాలి మృగ్యమవుతున్నాయి. మనం ఎక్కడ తప్పటడుగు వేశాము?”

“వాస్తవంగా ఈ సమస్యకి మూల కారణమేమిటని చూస్తే మనము మన అవసరాలకు విలాసాలకు మధ్య ఉన్న తేడాను గుర్తించలేని అసమర్థులమని తెలుస్తుంది.”

“ఒకవేళ మన వర్తమాన తరం ధర్మాన్ని జాగరూకతతో గ్రహించి  పునఃస్థాపించగలిగినప్పుడు పేదరికం మరియు ఆకలి అనేవి ఒక పీడ కల లాగా మాయమవుతాయి.”

“నూతన సంవత్సర ఆగమనము కాల గమనాన్ని గురించి మనకు గుర్తు చేస్తుంది. పగిలిన కుండలోంచి చుక్క చుక్కగా నీరు ఎలా కారుతుందో, అదే విధంగా నిమిష నిమిషమూ మన ఆయుర్దాయము క్షీణిస్తోంది. ఈ ప్రపంచములో మనిషికి ఉన్న అత్యంత విలువైన నిధి సమయము. ఒక్క సమయము తప్ప పోగొట్టుకున్నదేదైనా తిరిగి పొందవచ్చు,. మనము దీనిని అర్థము చేసుకుని, ప్రతి క్షణమూ జాగరూకతతో జీవించాలి. అంతే కాదు, గడియారము టిక్కుటిక్కుమంటున్న ప్రతి సారీ, మనము మృత్యువుకు దగ్గరవుతున్నామని గుర్తు చేసుకోవాలి.”

“ప్రపంచములో మనము చూసేది, వినేది, అనుభవము చేసుకునేది, ఏదైనా సరే, అది అనిత్యమైనది. సర్వానికీ ఆధారమూ, నిత్యమూ అయిన ఆత్మని మనము తెలుసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ ప్రపంచంలోని ఏ వస్తువు ఏ వ్యక్తీ మన నుంచి వేరు కాదని.”

“మనము నవ్వినా ఏడ్చినా రోజులు మాత్రము గడిచిపోతాయి. కాబట్టి మనము ఎందుకు నవ్వటాన్ని ఎంచుకోకూడదు? నవ్వనేది ఆత్మ యొక్క సంగీతము. అయితే, ఇతరులలోని లోపాలను చూసి మనము నవ్వకూడదు. మనము అందరిలోనూ మంచినే చూస్తూ సత్‌చింతనలు, సత్‌వాక్కులు, సత్‌కర్మలను  పంచుకోవాలి. మనము మనలోని లోపాలను తప్పిదాలను చూసి నవ్వటానికి ప్రయత్నించాలి.”

“అనేక మంది పిల్లలు అమ్మను అడుగుతుంటారు “అమ్మా, 2012 లో ప్రపంచము అంతమవుతుందా?” అని. అలా జరుగుతుందని అమ్మ అనుకోవటము లేదు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు సంభవించవచ్చు. మనము భూమిని చూసినా, నీటిని చూసినా, గాలిని చూసినా, ప్రకృతిని చూసినా, మనుషులను చూసినా, అన్నీ కల్లోల స్థితిలో ఉన్నాయని తెలుస్తుంది. ఈ కల్లోలం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉరుము లాగా ప్రతిధ్వనిస్తుంది. ఏదేమైనా, మరణమనేది జీవితంలో ఒక అనివార్యమైన భాగము. అది ఎక్కడైనా, ఎప్పుడైనా సంభవించవచ్చు. అయితే, ఫుల్‌స్టాప్ పెట్టిన తరువాత కొత్త వాక్యము వ్రాయడం మొదలుపెట్టిన విధంగానే, ఒక జీవితపు అంతము మరొక జీవితారంభాన్ని సూచిస్తుంది. కానీ మనము భయముతో జీవించకూడదు. బదులుగా, మనము అన్నింటినీ స్వీకరించే మనోభావాన్ని పెంపొందించుకోవాలి. “ఏదేమైనా సరే నేను శక్తివంతంగా, ధైర్యంగా, సంతోషంగా ఉంటాను” అనే మనోభావము ఉండాలి. భయముతో జీవించటమనేది బాంబు పైన పడుకోవటము వంటిది; ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రపోలేము. కానీ, అమ్మ తీవ్రమైన సంఘటనలు జరగటము చూడటం లేదు. విషాదకరమైన సంఘటనలనేవి ఎప్పుడూ ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా, ప్రయాణము చేసేటప్పుడు మనము ప్రమాదాలను చూడటం లేదా? విమానము కూలిందని మనము వినటం లేదా? వరదలు, భూకంపాలు, తుఫానులు మరియు సునామీలు క్రమం తప్పకుండా సంభవిస్తున్నాయి. మనము ఎక్కడ ఉన్నా, సంతోషంగా ఉందాము. మన సత్‍స్వరూపములో శ్రద్ధ విశ్వాసాన్ని పెంపొందించుకుందాము. సత్‍కర్మలు చేద్దాము.”

“క్రిమికీటకాలు పుడతాయి, వంశ వృద్ధి చేస్తాయి, మరణిస్తాయి. జంతువులు కూడా ఇదే చేస్తాయి. మానవులు కూడా ఇలాగే జీవిస్తే, ఇక మనకు ఇతర జీవాలకు మధ్య ఉన్న తేడా ఏమిటి? మనము ప్రపంచానికి ఏమి సందేశము ఇస్తున్నాము? మహాత్ములు తమ నిష్కామ కర్మల ద్వారా అమరులయ్యారు. వారు చేసినంతగా మనము చెయ్యలేకపోవచ్చు, సర్వం అర్పించలేకపోవచ్చు. కానీ, ఇతరుల కోసము ఏమైనా చెయ్యగలమేమో చూసి దానికోసం కొంచెమైనా ప్రయత్నిద్దాము. ఎడారిలో ఒక్క చెట్టు పెరగగలిగినా, కనీసం దాని క్రింది కొంత నీడనైనా ఇవ్వగలుగుతుంది. ఒక పుష్పం వికసించినా, కనీసం ఆ మాత్రం సౌందర్యం ఉంటుంది. ఒక జీరో-వాట్ బల్బు కాంతి క్రింద మనము చదవలేకపోవచ్చు, కానీ అలాంటి అనేక బల్బులు కలిసి ప్రకాశించినప్పుడు, మనము సరిగ్గా చూడగలము. ఈ విధంగా, ఐక్యత ద్వారా మనము ఎంతో సాధించవచ్చు. ఈ ప్రపంచము ఒక సరస్సు వంటిది, ఒక వ్యక్తి ద్వారా దానిని శుభ్రం చెయ్యడం సాధ్యం కాదు. అయితే, ప్రతి ఒక్కరూ తమ తమ వంతు కృషి చేస్తే, మనమందరమూ కలిసి తప్పకుండా దీనిని శుభ్రం చెయ్యగలము. మనము సోమరితనాన్ని వదిలివెయ్యాలి. మనము చెయ్యగలిగినది మనం చేద్దాము. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించగలము.”

“ఇతర నిర్ణయాలలా, ఆనందంగా ఉండటమనేది కూడా ఒక నిర్ణయమే – “ఏదేమైనా నేను సంతోషంగా ఉంటాను. నేను శక్తిని కలిగి ఉంటాను. నేను ఎప్పుడూ ఒంటరిగా లేను. పరమాత్మ ఎప్పుడు నాతో ఉన్నాడు.” అనే దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. నా పిల్లలందరూ మానసికశక్తి, ఉత్సాహము మరియు ఆత్మవిశ్వాసము కలిగి ఉండుగాక. నా పిల్లలందరి మీదా పరమాత్ముని కృప వర్షించుగాక.”

అమ్మ, శ్రీ మాతా అమృతానందమయి దేవి 2012 నూతన సంవత్సర సందేశ సారాంశము