పిల్లలారా, సహనము కలవాడికి మాత్రమే ఆధ్యాత్మిక జీవితము సాధ్యము.

బాహ్యాచారాలను మాత్రం చూసి ఒకరి ఆధ్యాత్మికోన్నతిని కొలవటము సాధ్యం కాదు. ఒక సాధకుడు ప్రతికూల పరిస్థితులలో ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అన్నదాని ఆధారంగా అతడి ఆధ్యాత్మిక పురోగతిని కొంతవరకు అర్థము చేసుకోవచ్చు.

చిన్న విషయానికి కూడా కోపించేవాడు లోకానికి దారెలా చూపగలడు? పిల్లలారా, సహనము ఉన్నవాడు మాత్రమే ఇతరులకు దారి చూపగలడు. అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఒక కుర్చీలో ఎంతమంది కూర్చున్నా అది ఫిర్యాదు చేయదు. అదే విధంగా, ఎంతమంది మనల్ని ద్వేషించినా వారిని సహించి మన్నించగలిగే శక్తిని ఆర్జించాలి. లేకపోతే సాధన చేయటం వలన ఏ ఫలితముండదు.

కోపము వలన సాధన ద్వారా ఆర్జించిన ఎంతో శక్తి నష్టమౌతుంది. వాహనాన్ని నడిపించేటపుడు ఎక్కువ శక్తి నష్టమవ్వదు. ఆపేటప్పుడు, స్టార్ట్ చేసేటప్పుడే ఎక్కువ ఇంధనము ఖర్చవుతుంది. అదే విధంగా, కోపగించుకోవడము వలన ప్రతి రోమకూపము నుండీ శక్తి నష్టమౌతుంది.

ఒక సిగరెట్ లైటరును పది, ఇరవై సార్లు నొక్కినప్పుడు దాంట్లోని పెట్రోలు నష్టమౌతుంది. అయితే అది మనకు కనపడటము లేదు. కానీ తెలుసుకోగలుగుతున్నాము. అదే విధంగా, సత్‍చింతనల ద్వారా సంపాదించిన శక్తి కూడా అనేక కారణాల వలన నష్టమౌతున్నది. అదే విధంగా, కోపము వచ్చినప్పుడు సాధన ద్వారా ఎంత సంపాదించామో అదంతా నష్టపోతాము. మాట్లాడినప్పుడు నోటి ద్వారా మాత్రమే జీవశక్తి నష్టమౌతున్నది. కోపము వచ్చినప్పుడు కళ్ళు, చెవులు నుండే కాక సకల ద్వారాల నుండీ జీవశక్తి నష్టమౌతుంది.

పిల్లలారా, ఒక ఆధ్యాత్మిక సాధకుడికి సమయపాలనలో నిష్ఠ తప్పకుండా అవసరము. రోజూ ఈ ఈ సమయాలలో, ఇన్ని గంటల పాటు జపధ్యానాలు చేయాలి అని ఒక సమయపాలనా పట్టిక అవసరము. నిర్ణీత సమయములో సాధనలు చేయాలి అనే స్వభావాన్ని పెంపొందించుకోవాలి. ఈ స్వభావమే మనల్ని పురోగమింపచేస్తుంది.

సాధనాక్రమాలలో సమయపాలన నిష్ఠగా పాటించేవాడు  ఆ ఆ సమయాలలో వాటిలోనే నిమగ్నమవుతాడు. టీ త్రాగటానికి అలవాటు పడ్డవాడు ఆ నిర్ణీత సమయానికి టీ త్రాగవలసిందే. లేకపోతే, అతడు అశాంతికి లోనవుతాడు. అతడు టీ కోసము పరుగెడతాడు.