పిల్లలారా, సముద్రపు అలలను నిరోధించడానికి తీరమున్నది. ఆధ్యాత్మిక జీవితంలో, మనస్సు యొక్క అలలను నిరోధించేది వ్రతాచరణలే.

ఏకాదశి, పౌర్ణమి మొదలైన దినాలలో వాతావరణం పూర్తిగా కలుషితమై ఉంటుంది. ఈ రోజులలో పండ్లు మాత్రమే భుజించి, మౌనవ్రతము ఆచరించటం మంచిది. పండ్లు తోలుతో కప్పబడి ఉండటం వలన వాతావరణ కాలుష్యం వాటిపై అంతగా ప్రభావం చూపదు. ఈ రోజులు సాధనకు ఎంతో అనుకూలమైనవి. అప్పుడు, మన ఆలోచనలేవైనా; ఆధ్యాత్మికము కానీ, భౌతికము కానీ, వాటిలో మరింత ఏకాగ్రతను పొందవచ్చు.

నెలకు కనీసం రెండు సార్లైనా జీర్ణకోశాన్ని శుభ్రము చేయటానికి విరేచనాల మందు తీసుకోవటము సాధకునికి మంచిది. వారంలో ఒక రోజు పండ్లు మాత్రమే భుజించి, మౌనవ్రతముతో జపధ్యానాలు చేయాలి. ఇది శరీరానికీ సాధనకీ మేలు చేస్తుంది.

నిరంతర సాధనే వ్రతంగా ఆచరించేవారికి, నిరాహార వ్రతములు మొదలైనవి ఆచరించటం వలన వారి మనస్సు, శరీరము వారి ధ్యానానికి అనుకూలమయ్యి తీరుతాయి. కానీ, సాధనతో పాటు వేరే పనులు కూడా చేసేవారు సంపూర్ణ ఉపవాసాలు ఆచరించకూడదు. వారు అవసరమైనంత ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు ఉత్తమమైనవి.

పని చేసి సంపాదించిన డబ్బు మొత్తం, తరువాతి నిమిషంలో వేరుశనగలు కొనటానికి ఖర్చు పెట్టటం లాంటిది ధ్యానము చేసిన వెంటనే మాట్లాడటము. ధ్యానము ద్వారా ఆర్జించిన శక్తంతా నష్టమవుతుంది.

సాధకుడు ప్రతి మాటనూ శ్రద్ధతో జాగ్రత్తగా పలకాలి. అతడి సంభాషణ ఎంతో మృదువుగా ఉండాలి. వింటున్నవారు తమ మనస్సునూ, ఇంద్రియాలనూ ఎంతో ఏకాగ్రతతో నియంత్రించితే మాత్రమే వినగలిగే విధంగా అతడు మాట్లాడాలి.

పిల్లలారా, వ్యాధి నయమవ్వాలంటే రోగి పథ్యం పాటించాలి. లక్ష్యాన్ని చేరేవరకు సాధకుడికి కూడా పథ్యం ఆవశ్యము. మాట్లాడటము తగ్గించుట, మౌనవ్రతము ఆచరించుట, ఆహారము నియంత్రించుట మొదలైనవి సాధకుడికి పథ్యం.

ఈ వ్రతాచరణలేవీ దుర్బలత కాదు. పడవను నిర్మించడానికి కలప తీసుకుంటే అది వంపు తిరిగి ఉంటేనే ప్రయోజనముంటుంది. చెక్కని వంచడానికి, దానిని వేడి చేస్తారు. ఇదే విధంగా, వ్రతాచరణల ద్వారా మనస్సును వంచి, స్వాధీనములోకి తెచ్చుకోవటానికి సాధ్యమవుతుంది. మనస్సును లొంగదీయకుండా శరీరాన్ని నియంత్రణలోకి తెచ్చుకోలేము.