ప్రాణాయామము చేసేటప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఎంతో శ్రద్ధతో మాత్రమే అభ్యసించాలి. సాధారణంగా కలిగిన జబ్బులకు చికిత్స చేసి నయం చేయవచ్చు, కానీ తప్పుగా ఆచరించిన ప్రాణాయామము వలన కలిగిన జబ్బులకు చికిత్స చేసినా నయమవ్వవు.

ప్రాణాయామము చేస్తున్నపుడు పొత్తికడుపు భాగంలోని పేగు కదలికకు లోనవుతుంది. దీని అంతటికీ ఒక క్రమముంది. మాత్రాక్రమము1. ఈ క్రమాన్ని ఉల్లంఘించిన వారి పేగు వదులవుతుంది. తరువాత, తిన్న ఆహారం జీర్ణము అవ్వకుండా అలాగే మలము అవుతుంది. అందువలన, పూర్ణుడయిన గురువు నుండే ప్రాణాయామము అభ్యసించాలి. ఒక్కో సమయంలో ఏమి చెయ్యాలో వారికి తెలుసు. దానిననుసరించి వారు మూలికా ఔషధములు వగైరా ఇస్తారు. అలా కాకుండా పుస్తకములో చదివి ప్రాణాయామము చేయటానికి కూర్చుంటే, అది సరి కాదు. ఎవరూ ఆ విధంగా చేయకూడదు.

పిల్లలారా, ఒక్కో ఘట్టంలో ఇన్ని సార్లు ఈ మోతాదులో ప్రాణాయామము చెయ్యాలి అని నిర్ణయించబడినది. అది అనుసరించకపోతే ప్రమాదం. వాటి ప్రభావం, 5 కిలోలు పట్టే సంచిలో 10 కిలోల బియ్యం కుక్కుటకు ప్రయత్నించినట్లు ఉంటుంది.

ఏకాగ్రత పొందిన సమయాన శ్వాస నిశ్చలమవ్వటమే కుంభకము. శ్వాసే ఆలోచన అని చెప్పవచ్చు. ఏకాగ్రమైన ఆలోచనలను అనుసరించి శ్వాసగతిలో మార్పు వస్తుంది.

ప్రాణాయామము లేకుండా భక్తి ద్వారానే కుంభకము సంభవిస్తుంది. జపము మాత్రము నిరాటంకంగా చేస్తే చాలు.

 
— — —
1. ఒక మాత్ర అనగా ఒక హ్రస్వాక్షరాన్ని పలకటానికి పట్టే సమయము. ప్రాణాయామములోని ప్రతి దశనీ, యథాప్రకారంగా, ఇన్ని మాత్రల సేపు చెయ్యాలి అని నిర్ణయించబడింది.