పిల్లలారా, ప్రాణులలోని జీవశక్తే కుండలిని. చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్న ఒక ఆడ పాము ఆకృతిలో వెన్నెముక క్రింది భాగంలో ఈ శక్తి ఉంటుంది. ధ్యానము వలన కానీ, గురు కృప వలన కానీ ఈ శక్తి మేల్కొంటుంది. మేల్కొన్నాక శిరస్సులో ఉంటున్న మగ పాముని చూసిన వ్యాకులతతో, వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఈ శక్తి పైకి దూకుతుంది. సుషుమ్నలోని ఒక్కో ఆధారము ఒక చిన్న రంధ్రము లాగా కనపడుతుంటుంది. ఒక ఆధారములో నుండి వేరొక ఆధారములోకి కుండలిని దూకుతున్నప్పుడు శరీరములో పలు మార్పులు సంభవిస్తాయి.

 

శరీరమంతా మండుతున్నట్లు అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలని రుద్దిన మాదిరిగా అనిపిస్తుంది. శరీరమంతా కాల్చినట్లు ఉంటుంది. తరచుగా రోమాంచితమవుతుంది. శరీరమంతా, రోమకూపముల నుండి చెమటలాగా నీరు వస్తుంది. అప్పుడప్పుడు దానంతటదే జలస్రావము అవ్వవచ్చు. కొన్ని సందర్భాలలో రోమకూపాల నుండి రక్తము కూడా బయటకు వస్తుంది. శరీరము సన్నబడి ఎముకలాగా అయ్యి తీరుతుంది.
ఇదంతా మొట్టమొదటిసారిగా అనుభవిస్తున్న సాధకుడు భయపడవచ్చు. అందుకే, సద్గురువు యొక్క సాన్నిధ్యంలో మాత్రమే కుండలినీధ్యానము చెయ్యాలని చెప్పబడింది.

 

పిల్లలారా, ఈ పరిస్థితిలో సాధకుడు ఎంతో శ్రద్ధ చూపాలి. శరీరాన్ని అసలు కదపకూడదు. పరుపు పైన అసలు పడుకోకూడదు. కారణం, అందులోని ముడతలు కూడా వారికి అసహనీయముగా అనిపిస్తాయి. కొంచెము కూడా వంపు లేని, నునుపైన చెక్క పలక మీదే వారు పడుకోవాలి. వెన్నెముకకు ఒక దెబ్బ కూడా తగలకూడదు. అది వారిలో పెద్ద ప్రతిచర్యలను కలుగచేస్తుంది.

 

కుండలిని మేల్కొన్న సాధకుడు ఒక తీవ్ర ఆకర్షణాకేంద్రముగా మారుతాడు. మోహితులైన స్త్రీలు వగైరా అతని చుట్టూ చేరతారు. అవసరమైన నిర్దేశములు ఇవ్వటానికి ఒక సద్గురువు లేకపోతే, ఇంద్రియ సుఖాలు వంటి వాటిలో కలుగచేసుకుని అతడు తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న శక్తిబలాలను పూర్తిగా నాశనము చేసుకుంటాడు.

 

ఒక్కో ఆధారములోకి కుండలిని వచ్చినప్పుడు, ఆ ఆధారాన్ని పరిపాకము చేసినాకే, అక్కడి నుంచి పైన ఉన్న ఆధారానికి చేరుకుంటుంది. ఈ విధంగా మూలాధారాది షడాధారములను దాటుకుని కుండలినీశక్తి సహస్రదళానికి చేరుకుంటుంది.

 

సహస్రదళానికి చేరుకుంటే శరీరము చల్లబడుతుంది. శరీరము మొత్తం అమృతము వర్షిస్తుంది. తరువాత మిగిలినది పాత శరీరము కాదు. ఆత్మశక్తి నిండిన కొత్త శరీరము. ఒక చెట్టు యొక్క వేర్లు నీటిని, ఎరువుని పీల్చుకొని ఆకులకు చేరుస్తాయి. ఆకులు వాటిని పరిపాకము చేసి వేరులతో పాటు చెట్టు యొక్క సర్వాంగాలకు చేరుస్తాయి. పిల్లలారా, పరిపాకమైన ఈ శక్తే చెట్టుని నిలుపుతున్నది. అదే విధంగా మూలాధారములోకి చేరి, సహస్రదళములో పరిపాకమవుతున్న శక్తే అమృత వర్షమయ్యి, నాడుల ద్వారా సర్వాంగాలకూ శరీరమంతటా వ్యాపించి ఓజస్సు అయ్యి శరీరానికి పుష్టి కలిగిస్తుంది.