ఒకరు పండిన పనసపండుని తినడానికి ఇష్టపడతారు. ఒకరు ఉడికించినది తింటారు, వేరొకరికి వేయించినది కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటే ఇష్టం. ఎట్లా తిన్నా ఆకలి తీరటమే లక్ష్యం. అదే విధంగా, భగవంతుడిని తెలుసుకోవటానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గం అనుసరిస్తున్నారు. పిల్లలారా, ఏ మార్గంలో వెళ్ళినా లక్ష్యం ఒక్కటే, భగవత్సాక్షాత్కారము.

తత్వజ్ఞాన రహితమైన భక్తి మనిషిని బంధించటానికి మాత్రమే సహాయ పడుతుంది. అది ముక్తుడిని చేయలేదు. వేర్లు విస్తరిస్తున్న మల్లెతీగ, వేరే చెట్టులను బంధించకుండా, పైకి పెరగలేదు.

భక్తి లేని జ్ఞానం, రాతిని కొరుక్కు తినటం వంటిది.

అనేక దేవుళ్లున్నారన్న భావం లేకుండా ఏకమైన భగవంతుని పట్ల నిస్వార్థ ప్రేమ కలిగి శరణు వేడుకోవటమే తత్వజ్ఞాన మూలమైన భక్తి. ‘నేను దీనికోసం వెళ్తున్నాను’ అనే లక్ష్యబోధం మనసులో ఉంచుకుని ముందుకు సాగాలి. తూర్పుకి వెళ్లవలసినవాడు పడమరకు పయనమై వెళ్తే అది ఫలించదు కదా.

పిల్లలారా, జీవిత లక్ష్యము భగవత్సాక్షాత్కారమే. దానికై శ్రమించండి. గాయపడినట్లైతే, గాయం పైనున్న మలినాన్ని కడిగిన తరువాత మాత్రమే మందు పూస్తాము. లేకపోతే చీము పడుతుంది. మానదు. అదే విధంగా, భక్తితో అహంకారాన్ని కడిగిన తరువాతే జ్ఞానాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక వికాసం వస్తుంది.

వెన్నను కరిగించి ఉంచితే అది చెడిపోదు. అది “నేను వెన్నని” అని చెప్పి గర్వంతో కరగడానికి నిరాకరించితే, అది దుర్గంధభరితమౌతుంది. కానీ, భక్తితో కరిగించితే దుర్గంధం రాదు. పిల్లలారా, కేవలం భక్తి వలన మాత్రమే గర్వము మరియు ఇతర కల్మషాలను కరిగించగలము.

కొంతమంది, అమ్మ ఎందుకు భక్తి మార్గానికి ప్రాముఖ్యతనిస్తుంది అని అడుగుతారు. పిల్లలారా, అద్వైతాన్ని స్థాపించిన శంకరాచార్యులు చివరకు భక్తిసంబంధితమైన సౌందర్యలహరిని వ్రాయవలసి వచ్చింది. బ్రహ్మసూత్రం రచించిన వ్యాస ముని భాగవతాన్ని రచించిన తరువాత మాత్రమే సంతృప్తి పొందారు. వేయికి ఒకరు లేక ఇద్దరు జ్ఞానమార్గం ద్వారా లక్ష్యాన్ని చేరుతూ కనపడతారు. మిగిలిన సాధకుల్ని అమ్మ విడిచిపెట్టగలదా? వారికి భక్తి మార్గము మాత్రమే ఉపకరిస్తుంది. బ్రహ్మసూత్ర్రాల్ని రచించటం వలన అద్వైతాన్ని గురించి మాట్లాడటం వలన, సామాన్య జనులకు అంతగా ఉపయోగకరముగా లేదని గ్రహించి, చివరకు వారు భక్తిసంబంధమైన గ్రంథాల్ని రచించారు.

భక్తి మార్గంలో మనం మొదటి నుండే ఫలాన్ని పొందగలము. పరమానందాన్ని అనుభవించగలము. తక్కిన మార్గాలలో చివరలో మాత్రమే పొందగలము. భక్తి యొక్క ఫలం, పనస చెట్టు నుండి పనస కాయ పొందటం వంటిది. క్రింద నుంచే, చెట్టు మొదలు నుంచే, కాయలు దొరుకుతాయి. కానీ మిగతా చెట్లలో, అధిక భాగం చెట్టు చివరి వరకు ఎక్కినప్పుడు మాత్రమే ఫలాన్ని పొందగలము.

మొదట్లో భగవంతుని పట్ల భయభక్తులు ఉండాలి. ఆ తరువాత అది అవసరం లేదు. సర్వోత్కృష్టమైన ప్రేమావస్థకు చేరినప్పుడు భయానికి తావులేదు.

ఎంత జపధ్యానాలు చేసినప్పటికీ భగవంతుని పట్ల ప్రేమ లేకపోతే పనికిరావు. ప్రవాహానికి ఎదురు పోతున్న పడవని ఎంత బలంగా తెడ్డు వేసినప్పటికీ చాలా నెమ్మదిగా మాత్రమే ముందుకి పోతుంది. కానీ తెరచాప కడితే ఎంతో వేగంగా పోవటం చూస్తాము. పడవని ముందుకి నడిపిస్తున్న తెరచాప వంటిది భగవంతుని పట్ల ప్రేమ. చాలా వేగంగా లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇది సహాయపడుతుంది.

‘కర్మలను ఆచరిస్తే చాలు, కర్మలను ఆచరిస్తే చాలు’ అని అందరూ అంటూ ఉంటారు. అయితే, కర్మలను ఆచరించాలంటే, తత్ సంబంధమైన జ్ఞానం అవసరం. జ్ఞాన రహితమైన కర్మలు సరైన కర్మలు కాలేవు.

శ్రధ్ధతో ఆచరించిన కర్మలు మనల్ని భగవంతుని వద్దకు చేరుస్తాయి. మనకు శ్రధ్ధ ఉండాలి. శ్రధ్ధ ద్వారానే ఏకాగ్రత కలుగుతుంది. కానీ, చాలా సార్లు, కర్మ చేసిన తరువాత మాత్రమే, మనం ముందుగా తీసుకొని ఉండవలసిన జాగ్రత్తల గురించి ఆలోచిస్తాము. సామాన్యంగా పరీక్ష హాలు నుండి బయటకు వచ్చిన తరువాత మాత్రమే మనం “అయ్యో, ఈ విధంగా రాసి ఉన్నట్లైతే బాగుండేది” అని ఆలోచిస్తాము. అయిపోయిన తరువాత ఆ విధంగా ఆలోచించుట వలన ప్రయోజనమేమిటి?

పిల్లలారా, ఏ కార్యం చెయ్యటానికైనా శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేకపోతే ఏ కర్మ చేసినా దాని వలన ప్రయోజనముండదు. అత్యంత శ్రధ్ధతో ప్రతి కార్యాన్ని చెయ్యటం వలనే, ఒక సాధకునికి ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన కార్యాల యొక్క వివరాలు కూడా జ్ఞాపకముంటాయి. ఎంతో అల్పమని అనిపించే కార్యాలను కూడా అత్యంత శ్రధ్ధతో మాత్రమే చెయ్యాలి.

సూది అల్పమైన వస్తువు అని మనకు అనిపించినప్పటికీ, దాన్ని పట్టుకున్నప్పుడు మనం చాలా శ్రద్ధతో ఉంటాము. మనం శ్రద్ధ చూపించకపోతే సూది బెజ్జములోకి దారాన్ని ఎక్కించలేము. కుట్టుపని చేసేటప్పుడు ఒక్క క్షణం మనం అశ్రద్ధగా ఉన్నట్లైతే, సూది మన వేలుకి గ్రుచ్చుకుంటుంది. సూదిని మనమెప్పుడూ నిర్లక్ష్యంగా క్రింద పెట్టము. సరిగా చూసి పెట్టకపోతే అది వేరేవారి కాలులో గ్రుచ్చుకుంటుంది. వారికి ప్రమాదమవుతుంది. సాధకుడు ఏ పని చేస్తున్నా ఇటువంటి శ్రధ్ధ తప్పనిసరిగా ఉండాలి.

ఏదైనా పని చేసేటప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడితే పనిలో ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేకుండా పని చేస్తే దాని వలన ప్రయోజనము లేదు. ఏ పని చేస్తున్నా మంత్రం జపించుట మరచిపోవద్దు. మంత్రం జపించటానికి సాధ్యపడనటువంటి పని అయితే, పని మొదలుపెట్టటానికి ముందు భగవంతునికి ప్రార్థన చేయండి. “భగవంతుడా, నీ పని నేను చేస్తున్నాను. అది చేయటానికి తగిన శక్తిని ప్రసాదించు, నీ శక్తితోనే నేను పని చేస్తున్నాను.” ఈ విధంగా మనస్సులో అనుకోవాలి.

ఏ పని చేస్తున్నా భగవంతుడిని సదా స్మరిస్తున్న వాడే నిజమైన కర్మయోగి; నిజమైన సాధకుడు. అతడు ఏ పని చేసినా అందులో భగవంతుడినే చూస్తాడు. అతని మనస్సు చేస్తున్న పనిలో ఉండదు, భగవంతునిలో లీనమై ఉంటుంది.

పూర్వ జన్మల సంస్కారములు కలిగిన అతి కొద్ది మంది మాత్రమే జ్ఞాన మార్గమును అనుసరించగలరు. యథార్థమైన గురువు ఉంటే ఏ మార్గమైనా ఫరవాలేదు. రూప ధ్యానంలో మనం మనల్నే ధ్యానిస్తున్నాము. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చినప్పుడు నీడ అసలు కనిపించదు. అదే విధంగా రూపధ్యానంలో కూడా. మనంతట మనమే దానిగా (ధ్యాన రూపంగా) మారుతాము. పూర్ణత్వంలోకి వచ్చినాక నీడ లేదు. ద్వంద్వం లేదు. మాయ లేదు.

మొదట బాహ్య విషయాలలో శ్రధ్ధ అవసరం. బాహ్య ప్రవర్తనలో శ్రధ్ధ లేకపోతే, ఆంతరిక స్వభావాన్ని జయించుట సాధ్యం కాదు.