పిల్లలారా, ఋషులయొక్క అనుభవమే శాస్త్రం. అది బుద్ధితో తెలుసుకోగలిగినది కాదు. అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము.

శాస్త్రం మహాసముద్రమువలె విశాలమైనది. అది అంతా మనకు అవసరము లేదు. సముద్రములోని రత్నాల వలె, శాస్త్రాలలోని తత్వములే మనకు అవసరము. చెరుకు తింటున్నవాడు రసాన్ని మాత్రమే తీసుకుంటాడు. పిప్పి ఉమ్మివేస్తాడు.

సాధన చేసినవాడు మాత్రమే శాస్త్రాలలోని సూక్ష్మాంశాలను గ్రహించగలడు.

శాస్త్రపఠనము మాత్రమే పరిపూర్ణత్వానికి దారి తీయదు. మందు సీసాపై ఈ విధంగా మందు తీసుకోవాలని వ్రాసి ఉంటుంది. రోగం నయమవటానికి మందులు తెచ్చుకున్నవాడు, అది చదివి కూర్చుంటే రోగం నయమవదు. కేవలం శాస్త్రపఠనము చేత ముక్తి లభించదు. అభ్యాసం కూడా కావాలి.

శాస్త్రం అభ్యసించకుండా చేసే ధ్యానం కంటే, శాస్త్రాభ్యాసంతో కూడిన ధ్యానము మేలైనది. మనస్సు కలత చెందినపుడు, శాస్త్రం పఠించినవాడు దుఃఖించకుండా తాను చదివిన ఆ శాస్త్ర వాక్యాలను మననం చేసుకుంటూ శక్తిని పొందగలడు. దుర్బలతను జయించుట సాధ్యమవుతుంది. సాధనను శాస్త్రపఠనంతో కలిపి చేసినవాడు మాత్రమే లోకానికి నిస్వార్థమైన సేవ చేయగలడు.

శాస్త్రపఠనం కొంతవరకు అవసరమే. వ్యవసాయాన్ని గురించి చదువుకున్నవాడు కొబ్బరి కాయను నాటి పెంచటానికి ప్రయాసపడనక్కరలేదు. ఎప్పుడైనా తెగులు లక్షణాలు కనిపించినట్లైతే దానికి ఎలా చికిత్స చేయాలో అతనికి తెలుసు. అంటే, కొబ్బరి కాయను చిత్రించి కూర్చుంటే దాహం తీరదు. కొబ్బరి కాయలను పొందాలంటే మెదట కొబ్బరి మొక్కను నాటి, దాని పోషణ చేయాలి. శాస్త్రంలో చెప్పినది అనుభవంలోకి తెచ్చుకోవాలంటే, సాధన చేయటం తప్పనిసరి.

సాధన చేయకుండా కేవలం శాస్త్రపఠనంలో మాత్రమే సమయాన్ని గడిపేవాడు, ఇంటి నమూనా గీసి అందులో నివసించడానికి ప్రయత్నించే వాడిలాగా, మూర్ఖుడు.

దారి తెలుసుకుని వెళ్తే యాత్ర తేలికవుతుంది. పైగా గమ్యం త్వరగా చేరవచ్చు. పిల్లలారా, శాస్త్రాల వలన ప్రయోజనం ఇదే.

ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నవాడు ఒక రోజులో మూడు గంటలకన్నా ఎక్కువగా శాస్త్రపఠనానికి వెచ్చించకుండా మిగిలిన సమయాన్ని జప ధ్యానాలలో గడపాలి.

అతిగా శాస్త్రపఠనం చేసినట్లైతే ధ్యానంలో కూర్చోవడం సాధ్యం కాదు. మనసులో లోకులకు బోధించాలన్న కోరిక కలుగుతుంది. “నేను బ్రహ్మము కదా? మరింక ధ్యానం ఎందుకు చేయాలి?” అనే ఆలోచన ఉంటుంది. ధ్యానానికి కూర్చున్నప్పటికీ మనస్సు అనుమతించదు, లేవటానికి ప్రేరేపిస్తుంది.

పిల్లలారా, జీవిత కాలమంతా శాస్త్రపఠనం చేయడంవల్ల ప్రయాజనమేమిటి? పంచదార రుచి తెలుసుకోవడానికని ఒక బస్తాడు పంచదార మొత్తం ఎవరూ తినరు. ఒక్క చిటికెడు తింటే చాలు.

గాదెలో పడి ఉన్న ధాన్యపు గింజకి తనలోనే సర్వమూ ఉందన్న భావం ఉంటుంది. మట్టి ముందు నేనెందుకు తల వంచాలి అని అది ఆలోచిస్తూ ఉంటుంది. కానీ, బయటకి వచ్చి మొలకెత్తితే, తన నుండి ధారాళంగా ధాన్యం లభిస్తుంది కదా, ఇతరులకు ప్రయోజనకరము కదా అని అలోచించదు. ఇలా గాదెలోనే ఉండిపోవడంవల్ల అది ఎలుకకి ఆహారంగా మాత్రమే అవుతుంది. కేవలం శాస్త్ర పాండిత్యం మాత్రమే ఉన్నవారు, గాదెలో పడి ఉన్న ధాన్యపు గింజ వంటివారు. సాధన లేకుండా వారికి అది సరైన ప్రయోజనం ఎలా చేకూరుస్తుంది? చిలుక లాగా “నేను బ్రహ్మము, నేను బ్రహ్మము” అని అంటూ కూర్చోగలరంతే.