అమృతపురి చరిత్రలో అనేక అపూర్వమైన జంతువులు ఉన్నాయి. అమ్మ యొక్క సాధనా కాలంలో అనేక జీవులు సాయం చేశాయి: అమ్మ ధ్యానం చేసేటప్పుడు అమ్మ ముందు ఆహారం పడవేసిన గ్రద్ద; అమ్మ కోసం ఎవ్వరూ తాకని ఆహార ప్యాకెట్లను తన నోట కరుచుకుని తీసుకువచ్చిన కుక్క; అమ్మకు పాలు ఇవ్వటానికి తాడు తెంపుకుని వచ్చిన ఆవు మొదలైనవి. జంతు రాజ్యానికి చెందిన అనేక ఇతర అసాధారణ జీవాలు అనేక సంవత్సరాలు తరబడి అమృతపురిలో కనిపించేవి. వాటిలో గుడికి వచ్చే నెమళ్ళు, భజనకి వచ్చే కాకులు, స్నేహపూర్వక సర్పాలు, పిల్ల ఏనుగులు, కోతుల జంట, వెజ్ బర్గర్‌లు ఇష్టపడే గ్రద్దలు, అసాధారణ ఎలుకలు, వివిధ పిల్లులు, కుక్కలు ఉన్నాయి.

చాలా సంవత్సరాల పాటు, కైజర్ అనే ఒక ఎర్రని కుక్క ఆశ్రమానికి కాపలా కాస్తుండేది అన్ని దొంగల నుండి, అవి రెండు కాళ్ళవయినా లేదా నాలుగు కాళ్ళవయినా. వాడు తాగుబోతైనా లేదా కీడు చేద్దామనే ఉద్దేశ్యంతోనైనా ఆశ్రమ సరిహద్దులు దాటి లోపలికి వస్తే, ఆ వ్యక్తి బాధలు దేవుడికే ఎరుక. వేలాదిమంది ఉండే సమూహంలో కూడా కైజర్ ఆ వ్యక్తిని కనిపెట్టి వాడి దగ్గరికి వెళ్ళి, మొరుగుతూ వాడిని ఎటూ కదలనిచ్చేది కాదు.

 

Amma and Tumban looking at each other

 

ఈ విధంగా ఆశ్రమానికి కాపలా కాస్తూ ఎంతో విశ్వాసంగా ఉండేది. అది ఒక రోజు అనారోగ్యంతో మరణించింది. కైజర్ గతించిన తరువాత రెండు సంవత్సరాల వరకు ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఒక రోజు, ఆశ్రమ పరిసరాల చుట్టూ తిరుగుతూ ఉండే  ఓ రంగురంగుల చిన్న కుక్క ఒకటి, ఒక దహనకాండ సమయంలో అమ్మ ముందుకు వచ్చి నుంచుంది. తన దృష్టిని ఆకర్షించటంతో, అమ్మ దానిని దగ్గరకు పిలిచారు. వెంటనే తోక ఆడించుకుంటూ వచ్చి అమ్మ ప్రక్కనే కూర్చున్నది. వాడి పేరు తుంబన్ (కన్నడ భాషలో ‘తుంబ’ అనగా ‘సమృద్ధి’ లేక ‘అనేకమైన’) అని ప్రక్కనున్న వాళ్ళు చెప్పారు అమ్మకు. అమ్మ వాడిని ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి, వాడు ఆశ్రమంలో వెలిగిపోతున్నాడు. ఆశ్రమ పోలీసు అయ్యాడు. వాడికి మెడ పట్టీ, స్నానాలు మరియు పేలను అరికట్టే పొడి ఇవ్వబడ్డాయి.

తుంబన్ తన విధులను ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తాడు. ఇంతకు ముందు కైజర్ చేసినట్టుగా, ఆశ్రమం చుట్టూ గస్తీ తిరుగుతాడు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే  పట్టుకుంటాడు, అది మనుష్యులైనా లేక జంతువులైనా. అర్థరాత్రి వచ్చే వాహనాలకు ఎదురు వెళ్తాడు. అతిథులు అర్థరాత్రిలో ఆశ్రమానికి వచ్చినప్పుడు, తుంబన్ వారిని ఆహ్వానపూర్వకంగా పలుకరిస్తాడు, వారితో పాటు వసతి గృహం ఆఫీసు దాకా, ఆ తరువాత వారికి కేటాయించిన భవనం వరకు వెళ్తాడు. సామానులు మాత్రం మోయడం లేదంతే …

ధ్యానించటానికి అమ్మ బీచ్‌కి వచ్చినప్పుడు తుంబన్ తరచుగా అమ్మ ముందుకు వెళ్ళి కూర్చుంటాడు. ప్రార్థన చేస్తున్నట్టు లేక ప్రణామం చేస్తున్నట్టు పాదాలను ఇసుకలో ముందుకు చాచి, తరువాత కూర్చుంటాడు. అప్పుడప్పుడు అమ్మ వాడిని అడుగుతుంది, ధ్యానం చేయటానికి వచ్చావా అని. దగ్గరగా రమ్మని అమ్మ అప్పుడు వాడిని పిలుస్తుంది. ఆ విధంగా వాడు అమ్మ ప్రక్కనే, పీఠం మీద, “ధ్యానం” చేయటం మొదలుపెట్టాడు. వాడు కూర్చోవటానికి వాడికి ఒక సొంత ఆసనం కూడా ఏర్పాటు చేశారు.

 

Tumban sits next to Amma on the peetham

 

అమ్మ దర్శనం ఇచ్చే సమయంలో, అప్పుడప్పుడు దర్శనానికి తుంబన్ కూడా వస్తాడు. అమ్మ వాడిని పలకరించి, ఏమన్నా తినిపిస్తారు. అప్పుడు వాడు అమ్మ ప్రక్కనే కొంచెం సేపు కూర్చుంటాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వాడు అమ్మ లేదా తనకి రోజూ భోజనం పెట్టేవారి దగ్గర తప్ప ఇతరులెవ్వరు పెట్టినా తినడు. వాడికి అత్యంత ఇష్టమైన ఆహారం – వెన్న రాసిన చపాతీలు!

తుంబన్‌కి ఖచ్చితంగా అమ్మతో చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. దర్శనం ముగించి అమ్మ లేచినప్పుడు, అమ్మతో పాటు అమ్మ గదికి వెళ్ళటానికి, అంత మంది మధ్యలో కూడా వాడు అమ్మ దగ్గరకి పరిగెత్తి రావడం చూడవచ్చు. అమ్మ తన దగ్గరకి వచ్చే చిన్న పిల్లల మీద ఎక్కువ మమకారం చూపిస్తే, తుంబన్‌కి అసూయ అని చెప్పుకుంటారు.

ఒక రోజు రాత్రి, భజన సమయంలో, తుంబన్ వేదిక క్రింద ఉండే ర్యాంపు మీదకి వచ్చాడు. తోక ఊపుకుంటూ ముందుకీ వెనక్కీ నడిచాడు. చివరికి, అమ్మ ముందు నిలబడి, తోకని చాలా వేగంగా ఆడిస్తూ అమ్మ వంక ఆశగా చూడసాగాడు. అమ్మ వాడిని చూసి నవ్వి, వేదిక మీదకి రమ్మన్నట్టు చెయ్యి ఊపారు. ముద్దొచ్చేట్టు ఒక్క గంతులో, అమ్మ పాదాల దగ్గరకి చేరి చక్కగా కూర్చున్నాడు. వాడి ప్రవర్తన ఎంతో చక్కగా సరైన విధంగా ఉందని అమ్మ అందరి ముందు వాడిని పొగిడారు.  వేదిక మీదకి వచ్చే చనువు తీసుకోవటానికి ముందు వాడు అమ్మ ఆహ్వానం కోసం ఎదురు చూశాడు!

అమ్మ వాడే భజన పుస్తకాన్ని స్వామీజీ తుంబన్ ప్రక్కనున్న సంగీతం స్టాండ్ మీదపెట్టినప్పుడు, తుంబన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వేదిక నుండి క్రిందకి దూకాడు. ప్రతి ఒక్కరూ దానిని చూసి బాధ పడ్డారు. వాడు అక్కడ కూర్చుని ఉంటే చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది.

కొంచెం సేపు తరువాత, తుంబన్ వేదిక మీదకి తిరిగి వచ్చి, తన స్థానంలో కూర్చున్నాడు. ఈ సారి భజనలు పూర్తి అయ్యేంతవరకు అక్కడే కూర్చున్నాడు. అంతే కాదు, ఆరతి సమయంలో కదలను కూడా కదలలేదు. తిరుగుతున్న దీపజ్వాలకు భయపడలేదు. ఆరతి ఇస్తున్న బ్రహ్మచారి మీద అమ్మ పూలు చల్లినప్పుడు, కొన్ని పూలు వాడి మీద పడ్డాయి. అమ్మ పాదాల ముందు అలాగే ముడుచుకుని ఉండిపోయాడు. దీపశిఖ యొక్క కాంతి వాడి మీద పడి మినుకుమినుకుమంటోంది. వాడు మేల్కొని ఉన్నాడా లేక ఏదన్నా సుందర స్వప్నం కంటున్నాడా? అమ్మకి ఆరతి ఇచ్చినప్పుడు, ఒక కోణంలో, అది అఖండత్వానికి కూడా, సర్వ సృష్టికీ. సాధారణంగా శునక జాతికి మనము ఆరతిని ఇవ్వకపోయినా, అమ్మతో పాటు ఆరతి అందుకుంటున్న ఈ సృష్టి యొక్క ఇతర రూపాన్ని చూడడం ఎంతో సరైనది అనిపించింది.

ఆశ్రమ ఆధ్యాత్మిక దినచర్య పట్ల చిత్తశుద్ధి మరియు సమయపాలన, గురువు పట్ల  విధేయత మరియు భక్తి కల ఒక ఆదర్శ ఆశ్రమవాసి తుంబన్. ఉదయం అర్చనకి క్రమం తప్పకుండా వస్తూ ఉంటాడు: ఒక రోజు పురుషుల ప్రక్కకి వస్తే, మరుసటి రోజు స్త్రీల ప్రక్కకి వస్తాడు. గుడిలో జరిగే ఉపనిషత్తు తరగతులకి, రామాయణ చర్చలకి తప్పకుండా హాజరవుతుంటాడు; ప్రతి మంగళవారం జరిగే ధ్యానంలో పాల్గొంటాడు – అప్పుడప్పుడు అమ్మ దగ్గర నుంచి మధ్యాహ్న భోజన ప్రసాదాన్ని తీసుకోవటానికి కూడా వెళ్తాడు. అమ్మ విదేశ యాత్ర సమయంలో అమ్మ దేవీ భావము వీడియో వెబ్‌క్యాస్టుకి కూడా హాజరవుతుంటాడు తుంబన్! ఈ ప్రదేశాలలో తుంబన్ కూర్చోవటానికని వాడికి ఒక సొంత ఆసనం కూడా ఉంది. దానిమీద తప్ప కూర్చోడు. తుంబన్ యొక్క వైరాగ్యాన్ని, ఆశ్రమం, ఆశ్రమ ధర్మం పట్ల ఉన్న అంకిత భావాన్ని చూసి అమ్మ తుంబన్‌ని ఎప్పుడూ ప్రసంశిస్తారు.

Tumban appearing for Amma's pada-pujaఒక ఓనం పండుగ1 రోజు, తుంబన్ వేదిక మీద పాదపూజ చేయనివ్వకుండా ఒక భక్తుడికి అడ్డు పడిన కథనాన్ని ఒక బ్రహ్మచారి చెప్పాడు. తుంబన్ అమ్మ ముందు ప్రణామము చేస్తున్న విధంగా సాగిలపడ్డాడు. పాద పూజ చేయటానికి ప్రయత్నిస్తున్న భక్తుడిని పదేపదే నిరోధించసాగాడు, పూజా సామాగ్రికి అడ్డు పడుతూ, అక్కడి నుంచి కదలటానికి నిరాకరించాడు. కానీ, అమ్మ వాడిని ప్రక్కకి జరగమని చెప్పిన వెంటనే, తుంబన్ తక్షణమే అమ్మ మాట పాలించాడు.

ఒక రోజు, పెద్ద కుక్క ఒకటి అర్చన హాల్లోకి వచ్చింది. తుంబన్ మొరుగుతున్నా ఏమీ లక్ష్యపెట్టలేదు. వేదికకు దగ్గరగా ఉన్న ఆసనాల మీద పడుకుంది … తుంబన్ చాలా ఆదుర్దా పడ్డాడు. కానీ తనకంటే అది పెద్దదవటంతో ఎదిరించటానికి భయపడ్డాడు. ఆ కుక్కని వెళ్లగొట్టటానికి ఉత్తమ వ్యూహం గూర్చి బాగా ఆలోచించుకుని ఉంటాడు, కొద్ది సమయం తరువాత ఆ వ్యూహరచనకి సిద్ధమయ్యాడు: నెమ్మదిగా పడుకున్న ఆ కుక్క వద్దకు వెళ్ళి, దాని చెవిలో మూత్రం వదిలాడు (!) … వెంటనే పరుగెత్తి పారిపోయాడు, తాను చేసిన పని పట్ల సంతృప్తితో. ఆక్రమణదారుడికి సొంత ఇంట్లో లాగా ఉన్న అనుభూతిని చెడగొట్టటానికి ఇది సరిపోయింది. ఉలిక్కిపడి లేచి, దిక్కులు చూస్తూ, హాలు వదిలి వెంటనే వెళ్లిపోయింది … మరుసటి రోజు మళ్ళీ వచ్చింది, ఆ రోజు కూడా తుంబన్ నుంచి అదే మర్యాదను పొందింది … ఇక ఎప్పుడూ తిరిగి రాలేదు!

తుంబన్ గూర్చి ఎన్నో కథలు ఉన్నాయి. ఒక్కసారే అన్ని కథలూ చెప్పుకోలేము. అనేక ఆశ్రమవాసులకి తుంబన్‌తో ఎన్నో కథలూ, అనుభవాలూ ఉన్నాయి… ఆశ్రమవాసులు బయటకు వెళ్ళి చాలా రోజులు తరువాత తిరిగి వస్తే, గుర్తుంచుకుని పలకరిస్తాడు. రోజూ అర్చనకి వెళ్లే ఆశ్రమవాసులు ఒక రోజు వారి స్థానంలో సమయానికి కనపడకపోతే వారి తలుపు మీద గీరుతూ నిద్ర లేపుతాడు …

తుంబన్ చరిత్ర ఏమిటో, గత జన్మ వృత్తాంతము ఏమిటో, అమ్మతో అంత చనువుగా ఉండటానికి ఏం పుణ్యం చేసుకున్నాడో, అని అబ్బురపడుతూ చెప్పుకుంటారు. కానీ, తుంబన్ ఎవరో అని వ్యాకులత చెందటం కాదు మన పని, మనము ఎవ్వరమో అన్నది కనుక్కోవటమే మన పని! అదే మానవ జన్మ లక్ష్యం కూడా. జంతువులు కూడా మన ఈ అన్వేషణలో ప్రోత్సహిస్తూ, అమ్మతో తమకు గల బాంధవ్యం ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ, స్ఫూర్తినిస్తున్నాయి.

 

– ఆంగ్ల మూలము: సాక్షి

 

1  మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి ఎలా పెద్ద పండుగో, కేరళీయులకు ఓనం పెద్ద పండుగ.