అందరిలోనూ ఉన్న ఆత్మే నాలోనూ ఉన్నది. ఏదీ నా నుండి వేరుగా లేదు. వేరొకరి దుఃఖమూ, కష్టమూ నావే. ఇది అనుభూతిలోకి తెచ్చుకుని అర్థం చేసుకున్నవాడే ఙ్ఞాని.

జన్మతః పాడగలిగినవాడికి, సంగీతం నేర్చుకున్న ఒకతనికి మధ్యగల వ్యత్యాసంలాగానే అవతారమూర్తికీ జీవుడికి మధ్య తేడా. జన్మతః సంగీత సంస్కారం ఉన్నవాడు ఒక పాట వింటే, వెంటనే నేర్చుకుంటాడు. వేరొకతను అది నేర్చుకోవటానికి కొంచెం సమయం తీసుకుంటాడు.

సర్వమూ భగవదంశమే అయి ఉండటం చేత అందరూ అవతారమూర్తులే. అయితే, తాను భగవదంశమే అని తెలియక “నేను శరీరాన్ని, ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి” అని గర్వించే వాడే జీవుడు.

అవతారమూర్తులకు పూర్ణత్వ బోధము ఉంటుంది. వేరేవారికి అది ఉండదు. పైగా, అవతారమూర్తి ప్రకృతితో ఐక్యమై ఉండుట చేత, మనము వారి మనస్సుని సాధారణమైన మనస్సు అని చెప్పలేము. అన్ని మనస్సులూ వారివే. అంతేకాక, అవతారమూర్తి తానే ఒక విశ్వ మనస్సు. వారు శుధ్ధాశుధ్ధములకు ద్వంద్వాలకు అతీతమయినవారు. భగవంతుడు తానే మానవరూపంలో రావడమే అవతారమంటే.

అవతారమూర్తులకు పరిధి నిర్ణయించలేము. సముద్రములో తేలే మంచుకొండలాంటిది పరబ్రహ్మములో భగవంతుని అవతారము. ఐదో, ఆరో అడుగులుండే ఒక మానవ శరీరములో భగవంతుని శక్తిని పరిమితము చేయటము సాధ్యం కాదు. కానీ భగవంతుడు ఈ అల్ప శరీరం ద్వారా ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి సాధ్యమవుతుంది. అవతారమూర్తి యొక్క రూపములో ఉన్న మహత్వము అదే.

జనులు భగవంతునికి చేరువ కావడానికి అవతారమూర్తులు గొప్పగా సహాయపడతారు. మన కోసమే భగవంతుడు శరీరాన్ని ధరించాడు. యదార్థంలో వారు శారీరులు కారు. మనకు ఆ విధంగా అనిపిస్తుంది.

మహాత్ములు ఎక్కడికి వెళ్ళినా జనం వారి వెనుకే చేరతారు. సుడిగాలి వెనుక చేరే దుమ్ము ధూళి లాగా జనం ఆకర్షింపబడతారు. వారి శ్వాస ఉచ్ఛ్వాసమూ, వారి శరీరం పైనుండి వీస్తున్న గాలి చాలు లోకానికి మేలు చేయటానికి.

పిల్లలారా, క్రీస్తు శిలువ వేయబడ్డాడు. శ్రీకృష్ణుడు బాణంతో చంపబడ్డాడు. ఇది అంతా యదార్థంగా వారి సంకల్పం చేత మాత్రమే జరిగినవి. వారి సంకల్పానికి వ్యతిరేకంగా వారి సమీపములోకి పోవటం కూడా ఎవరికీ సాధ్యము కాదు. ఎదిరించటానికి వచ్చేవారిని భస్మీకరించగలరు. కానీ వారు అలా చేయలేదు. వారు లోకానికి ఒక ఆదర్శాన్ని చూపించటానికే శరీరాన్ని ధరించారు. వారు త్యాగం అంటే ఏమిటో చూపించటానికే దిగి వచ్చారు.

సన్యాసి అంటే సర్వసంగపరిత్యాగి అనే. ఏ తప్పునైనా సహించి, తప్పు చేసేవారిని క్షమించి, ప్రేమతో వారిని మంచి దారిన నడిపించే వారే సన్యాసులు. త్యాగమంటే ఏమిటో చూపించేవారే వారు. వారు సదా ఆనందముతో నిండి ఉంటారు. అది బాహ్యవస్తువులపై ఆధారపడడం వలన కాదు. తమలోనే వారు ఆనందాన్ని అనుభవిస్తుంటారు.

పిల్లవాడి చేయిపట్టుకుని నడిచేవాడు, పిల్లవాడిలాగే తప్పటడుగులు వేయకుండా వేగంగా నడిస్తే, పిల్లవాడు క్రింద పడిపోతాడు. అదే విధంగా సాధారణ జనాలను ఉద్ధరింపచేయాలంటే ముందుగా వారి స్థాయికి దిగి వెళ్ళాలి. పైగా, నేను సన్యాసిని అని చెప్పి అహంకారముతో రొమ్ము విరుచుకుని కూర్చోకూడదు ఒక ఆధ్యాత్మిక జీవి. అతడు లోకానికి ఆదర్శంగా ఉండాలి.

శ్రీకృష్ణుడు అన్ని వేషాలు వేశాడు. గోపబాలకుడయ్యాడు, మహారాజయ్యాడు, గృహస్థుడయ్యాడు, దూత అయ్యాడు, రథసారధి అయ్యాడు… తాను రాజునని చెప్పి దూరంగా కూర్చోలేదు. ఒక్కొక్కరి సంస్కారానికి అనుగుణంగా వారితో వ్యవహరిస్తూ, వారికి మార్గదర్శకత్వం ఏ విధంగా చేయాలి, అన్న విషయాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా ఉన్నవారు మాత్రమే లోకాన్ని ముందుకి నడిపించగలరు.

కాషాయవస్త్రాన్ని ధరించి “నేను సన్యాసిని” అని చెప్పి గర్వించే వారున్నారు కొందరు. అడవి చేమ దుంప మొక్కల్లాంటివారు వాళ్ళు. అడవి చేమ, చేమ దుంప మొక్క లాగే కనిపిస్తుంది. పీకి చూస్తే క్రింద ఏమీ ఉండదు (అడవి చేమకి వేరులో దుంప ఉండదు, మామూలు చేమ లాగా). కాషాయము యొక్క రంగు అగ్ని యొక్క రంగే. దేహత్వభావాన్ని దహించిన వారే ఇది ధరించుటకు యోగ్యులైనవారు.