“దేవుడున్నాడా? ఉంటే ఎక్కడున్నాడు?” అని ఎందరో ప్రశ్నిస్తూంటారు. “కోడి ముందా, గ్రుడ్డు ముందా? కొబ్బరికాయ ముందా, కొబ్బరిచెట్టు ముందా?” అని వారిని అడగండి. అటువంటి ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు? కానీ, కొబ్బరికాయకి కొబ్బరిచెట్టుకి అతీతంగా, సర్వానికీ ఆధారమైన శక్తి ఒకటుంది. అదే భగవంతుడు. వాక్కుకి అతీతమైన, వ్యక్తపరచలేని ఒక విశేష శక్తి! సర్వానికీ బీజకారణం అయిన దాన్నే, పిల్లలారా, భగవంతుడు అంటారు.

పిల్లలారా, దేవుడు లేడనటం తన నాలుకతో “నాకు నాలుక లేదు” అన్నట్లే ఉంటుంది. ఏ విధంగా చెట్టు విత్తులో ఇమిడి ఉన్నదో, వెన్న పాలలో వ్యాపించి ఉన్నదో, అదే విధంగా భగవంతుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు.

విత్తులో చెట్టు ఉన్నప్పటికీ, చెట్టుగా అవ్వాలంటే, అది మట్టిలోనికి వెళ్ళి చిగురించి రావాలి. దాసభావము రావాలి. గ్రుడ్డులో నుండి పిల్ల పుట్టాలంటే కోడి పొదగాలి – అంత ఓర్పు కలిగి ఉండాలి. పాలను తోడుపెట్టి, పెరుగు అయ్యి, చిలికినాక మాత్రమే వెన్న వస్తుంది – భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ, ఆయన్ను మన అనుభవానికి తెచ్చుకోవాలంటే దృఢ ప్రయత్నము అవసరం.

అహంభావము, స్వార్థపరత్వము ఉన్నచోట భగవంతుడు కానరాడు. మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తే భగవంతుడు మనవైపు ఒక అడుగు వేసినట్లైతే, స్వార్థపరత్వం చూపిస్తే మన నుండి వేయి అడుగులు దూరంగా వెళ్ళిపోతాడు. బావిలో దూకడానికి ఒక్కక్షణం చాలు, కానీ పైకి రావడం కష్టం. అదేవిధంగా భగవదనుగ్రహం పొందటం ఎంతో కష్టం. దాన్ని వృధాచేయడానికి ఒక్కక్షణం చాలు.

భగవంతుని కోసం తీవ్ర వ్యాకులత, భగవంతుని పట్ల నిష్కళంకమైన ప్రేమ లేనట్లైతే ఎన్ని జన్మలు తపస్సు చేసినప్పటికీ, భగవంతుడిని పొందుట సాధ్యము కాదు పిల్లలారా.

ఒకే స్త్రీని సోదరుడు తన సోదరిగాను, భర్త తన భార్యగాను, తండ్రి తన బిడ్డ గాను చూస్తారు. ఎవరు ఏ విధంగా ఆమెను చూసినా ఆ స్త్రీ ఒక్కటే. అదేవిధంగా, భగవంతుడు కూడా ఒక్కడే. ఒక్కొక్కరి మనోభావాన్ని బట్టి వివిధ భావాలు కనపడతాయి.

భగవంతుడు ఏ రూపాన్నయినా ధరించగలడు. మట్టి మట్టిగానే ఉంటుంది; అదే ఏనుగు, గుఱ్ఱం వంటి బొమ్మలుగా అవుతుంది. ఈ బొమ్మలన్నీ ఆ మట్టిలో ఉన్నవే. ఇలాగే చెక్క కూడా. చెక్కనుండి ఏ రూపాన్ని అయినా చెక్కవచ్చు. కానీ చెక్కని చెక్కలాగా చూస్తే అది చెక్కే. అదే విధంగా, భగవంతుడు సర్వవ్యాపకుడూ, నిర్గుణుడు. అయినప్పటికీ మీరు ఎలా భావన చేస్తారో, అదే విధంగా మీకు దర్శనమిస్తాడు.

పిల్లలారా, భగవంతుడు తన సంకల్ప మాత్రంచేత ఏ రూపాన్నయినా ధరించగలడు. తిరిగి మరల తన పూర్వస్థితిని చేరుకోగలడు; నీరు మంచుగడ్డగా మారి, మరల కరిగి నీరుగా మారినట్లు.

పలుచోట్ల నుండి ప్రవహించే నీరు, ఒక ఆనకట్ట నిర్మించుట ద్వారా రిజర్వాయర్‌లో నిలువ చేయబడుతుంది. ఆ ఆనకట్టనుండి వెలువడే జలపాతం యొక్క ఉధ్రుతి ద్వారా విద్యుదుత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా, ఇంద్రియ విషయాలలో సంచరించే మనస్సును ఏకాగ్రం చేసినట్లైతే, ఆ ఏకాగ్రతాశక్తి ద్వారా భగవద్దర్శనాన్ని పొందవచ్చు.

పిల్లలారా, మనం భగవంతుని అభయం పొందిన తరువాత ఇక భయపడవలసినదేమీ లేదు. అన్ని విషయాలు భగవంతుడే చూసుకుంటాడు. పిల్లలకు ఒక ఆట ఉంది (దొంగాట లేక అంటుకునే ఆట వంటిది). చాలామంది పిల్లలు చేరి తమలో ఒకరి చేతి మీద కొడతారు. ఆ కొట్టబడ్డ బాలుడు మిగిలిన వారిని అంటుకోవడానికి వెంటపడతాడు. మిగిలిన వారంతా దొరకకుండా తప్పించుకోవడానికి పరిగెడతారు. ముందే అనుకున్న చెట్టును పట్టుకున్నట్లైతే, అంటుకోవడానికి వెంటపడుతున్న బాలుడు వారినేమీ చెయ్యలేడు. అదేవిధంగా, మనం భగవంతుడిని పట్టుకున్నట్లైతే ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేరు.

తండ్రియొక్క చిత్రపటాన్ని చూసినప్పుడు కొడుకు చిత్రకారుని గురించో, లేక పెయింటు గురించో ఆలోచించడు. అతనికి తన తండ్రే ఙ్ఞప్తికి వస్తాడు. అదేవిధంగా ఒక భక్తుడు దైవ విగ్రహాలలో భగవంతుడినే దర్శిస్తాడు. విశ్వపితనే చూస్తాడు. నాస్తికులు ‘విగ్రహాన్ని చెక్కిన శిల్పిని పూజించాలి కాని విగ్రహాన్ని కాదు’ అని అనవచ్చు. వారికి భగవంతునిలో నమ్మకం మరియు విగ్రహారాధన వెనుకనున్న తత్త్వంపై సరియైన అవగాహన లేదు కనుకనే, పిల్లలారా, వారు అలా అంటారు.

లోకంలో కనపడే సమస్యలకు భగవంతుడిని నిందించుటలో అర్థం లేదు. ‘మీరు ఈ రీతిలో నడుచుకోవాలి’ అని భగవంతుడు చెప్పాడు. దానికి విరుద్ధంగా నడుచుకోవటం వల్ల కలిగే సమస్యలకు భగవంతుడు బాధ్యుడు కాడు. ఆయనని తప్పుపట్టటం సరికాదు. ‘కొలను అంచున తిరగకూడదు, నిప్పుని తాకకూడదు’ అని తల్లి బిడ్డకు నేర్పిస్తుంది. అది అనుసరించకుండా బిడ్డ కొలనులో పడితే లేక చేయి కాల్చుకుంటే, తల్లిని తప్పుపట్టటం ఎందుకు?

“అంతా భగవంతుడే చేస్తాడు” అని చెప్పి కూర్చునేవారు సోమరులు. భగవంతుడు మనకు ఇచ్చిన బుద్ధి, ప్రతిఒక్క పనినీ వివేకంతో చేయుట కొరకే. భగవంతుడే అంతా చూసుకునేటట్లైతే, మనకు బుద్ధి యొక్క అవసరం ఉండేది కాదు కదా?

“అంతా భగవత్సంకల్పమే అయినట్లైతే, మనతో తప్పులు చేయించే వాడు కూడా భగవంతుడే కాడా?” అని అనడంలో అర్థం లేదు. ‘నేను’ అనే భావన ఉన్నవాడు అతను చేస్తున్నవాటికన్నింటికీ ఉత్తరవాది తను మాత్రమే. భగవంతుడు కాదు. తప్పులు చేయించేవాడు భగవంతుడే అని మనం నిజంగా విశ్వసించినట్లైతే, మనకి ఉరిశిక్ష విధించినది కూడా భగవంతుడే అని చూడగలగాలి. ఇది మనకు సాధ్యమేనా?

పిల్లలారా, భగవత్సాక్షాత్కారము మరియు ఆత్మసాక్షాత్కారము రెండూ ఒక్కటే. అందరినీ ప్రేమించగల్గుట, విశాల హృదయము, సమత్వ భావము – ఇదే భగవత్సాక్షాత్కారము.

ఈ విశ్వంలోని సకల చరాచరములు మనల్ని ప్రేమించినప్పటికీ, ఆ ప్రేమ భగవత్ప్రేమ నుండి ఒక్క క్షణంలో మనం పొందే పరమానందములో కోటిలో ఒకటవ వంతు కూడా సరితూగలేదు. పిల్లలారా, భగవత్ప్రేమ నుండి మనం పొందే ఆ పరమానందము అంత గొప్పది. భగవత్ప్రేమతో పోల్చదగిన ఇంకొక ప్రేమ ఏదీ లేదు.

భగవంతుడు కనిపించనంత మాత్రం చేత లేడని అనవచ్చా? ఎంతోమంది తమ తాతలను ఎప్పుడూ చూచి ఉండకపోవచ్చు. అంతమాత్రము చేత వారు తమ తండ్రిని తండ్రి తెలియనివాడు అని పిలుస్తారా?

చిన్నతనంలో అమ్మని ఒక్కో విషయం అడుగుతూ సహకరిస్తూ జీవించాము. కొంత పెద్దయిన తరువాత స్నేహితుడితో స్నేహితురాలితో మన సమస్యలను చెప్పుకున్నాము. ఇంకొంచెం పెద్దయిన తరువాత భార్యతో చెప్పుకుంటాము. ఈ సంస్కారమే మనలో ఉన్నది. ఇది మారాలి. ఒక విశాలమైన సంకల్పశక్తితో మన దుఃఖాలను పంచుకోగలగాలి. దుఃఖాలను వేరొకరితో పంచుకున్నప్పుడే మనకు ఉపశమనము కలుగుతుంది. ఒక తోడు లేకుండా పెరగటం సాధ్యంకాదు. ఆ తోడు భగవంతుడు అయ్యి ఉండాలి.

నేటి మిత్రుడు రేపటి శత్రువు కావచ్చు. మనం శరణు పొందదగిన నమ్మదగిన ఏకైక మిత్రుడు భగవంతుడు మాత్రమే.

మనకు భగవంతునిపై నమ్మకం ఉంటే, దాని వలన భగవంతునికేం లాభం? సూర్యునికి కొవ్వొత్తి కాంతి అవసరమా? నమ్మిన వారికి మాత్రమే ప్రయోజనం. నమ్మకంతో, గుడిలో ప్రార్థించినప్పుడు, భగవంతునికి కర్పూర ఆరతినివ్వటం చూసినప్పుడు, మన మనస్సే ఏకాగ్రతనీ, శాంతిని పొందుతుంది.

ఒక్కో మతస్థుడు తమ తమ ప్రార్థనామందిరాలలో తమ తమ సంప్రదాయాలను అనుసరించి భగవంతుడిని ఆరాధిస్తారు. అయినప్పటికీ భగవంతుడొక్కడే. ‘పాలు’ అని అన్నా, ‘మిల్కు’ అని అన్నా, ‘దూద్’ అని అన్నా పాలయొక్క గుణము, రంగు మారవు. క్రైస్తవులు క్రీస్తు అని, మహమ్మదీయులు అల్లా అని పిలుస్తారు. శ్రీకృష్ణుని రూపం కూడా కేరళలో లాగా ఉత్తర భారతదేశంలో ఉండదు. వారి కృష్ణునికి తలపాగా వగైరా ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి, అభిరుచులకు అనుగుణంగా భగవంతుడిని భావించి పూజిస్తారు. మహాత్ములు కాలానుగుణంగా ఏకమైన ఈశ్వరతత్వాన్ని ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ రూపాలలో వ్యక్తపరిచారు.

కాలిపోతున్న ఇంటిలో చిక్కుపడినవాడో లేక ఈత రాక లోతయిన నీటిలో మునిగిపోతున్నవాడో, తన జీవితాన్ని రక్షించుకోవటానికి ఏ విధంగా తహతహలాడతాడో, ఈ శరీరం నుండి ఆత్మ జ్యోతిని చేరుకోవటానికి ఆ విధంగా తహతహలాడాలి. అటువంటి తీవ్రమైన వ్యాకులత ఉన్నవాడు భగవద్దర్శనం కోసం ఎక్కువ కాలం నిరీక్షించవలసిన అవసరం లేదు.

పిల్లలారా, తాళంచెవి పోగొట్టుకుంటే, ఆ తాళం తీయించడానికి మనం కమ్మరి కొలిమికి వెళతాము. రాగద్వేషాలనే (బంధనరూపమైన) తాళాన్ని తీయాలంటే, దాని తాళంచెవి భగవంతుని చేతిలో ఉంది.

భగవంతుడే సర్వానికి ఆధారము. భగవంతునిపై ఉన్న విశ్వాసంనుండి ప్రేమ వృద్ధి అవుతుంది. ప్రేమ వలన ధర్మబోధం వస్తుంది. నీతి కలుగుతుంది. శాంతిని అనుభవించగలము. మన చెయ్యి కాలినప్పుడు మందు రాయడానికి ఎంత ఆతురతతో ఉంటామో, అదే విధమైన ఆతురతతో ఇతరుల దుఃఖాల పట్లా కరుణ చూపించాలి. భగవంతునిపై పూర్తి విశ్వాసం ద్వారా ఇది పొందవచ్చు.