“రాష్ట్ర ప్రభుత్వాల, ఇతర సంస్థల సహకారం, మద్దతు లభిస్తే, భారతదేశం అంతటా పాఠశాలలని, బహిరంగ ప్రదేశాలని శుభ్రం చేసే బాధ్యతని తీసుకుంటామ”ని అమ్మ (మాతా అమృతానందమయి) చెప్పారు. “భారతదేశం ఎదుగుతోంది. అంటే అభివృద్ధి చెందుతోంది. కానీ పర్యావరణ శుభ్రత విషయాలలో మనం వెనకబడి ఉన్నాం. మన వీధుల్లోని శుభ్రతా లోపం దీనికి ఋజువు.” అని అమ్మ చెప్పారు.

పాశ్చాత్య దేశాల్లో వీధుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ, మూత్రశాలల్లోనూ, శౌచాలయాలలోనూ అత్యున్నత ప్రమాణాలుగల శుభ్రతని పాటిస్తున్నారు. పోల్చి చూస్తే, భారతదేశంలోని వీధుల్లో, బహిరంగ శౌచాలయాలలోని శుభ్రత ప్రమాణాలు భయంకరంగా ఉన్నాయి. వీధుల్లో మూత్రం పోయడం, వీధుల్లో, పేవ్‌‍మెంట్ల మీద ఉమ్మడం ప్రజలకి అలవాటుగా మారింది. చెత్త డబ్బాలు ఉన్నా ప్రజలకి చెత్తని, వ్యర్ధ ఆహార పదార్ధాలని వాటిలో వేసే అలవాటు లేదు. వారు వాటిని వీధి పక్కనో, లేదా మధ్యో వేస్తుంటారు. సామాజిక అభివృద్ధిలో, మెరుగుదలలో పర్యావరణ పరిశుభ్రత భాగమవుతుంది. ఇది జరగడానికి మనం విస్తృతమైన ప్రచారాన్ని చేయాలి. పర్యావరణ పరిశుభ్రత మీద మనం బహిరంగ ప్రదేశాలలో, బస్‌స్టాప్‌లలో, వీధుల పక్కన, ప్రకటన బోర్డులని పెట్టాలి.

“ఈ సేవా సంస్థ విజయానికి ఎమ్.ఏ.ఎమ్(మాతా అమృతానందమయి మఠం)కు టివి రంగం, పత్రికా రంగాల నిజాయితీతో కూడిన సహకారం, మద్దతు కూడా అవసరం” అని అమ్మ గట్టిగా చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలల యాజమాన్యాల కమిటీలు, స్థానిక ప్రజలు సహకరిస్తే, పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాలలో ఉచిత బహిరంగ శౌచాలయాలు నిర్మించేందుకు మాతా అమృతానందమయి మఠం సిధ్ధంగా ఉంది.

సరైన నకళ్ళతో, ప్రణాళికతో సాధారణ ప్రజల, విద్యార్ధుల సహకారంతో ఈ పధకం అమలు చేయబడుతుంది.

ఈ పధకం తొలుత కేరళలో మొదలవుతుంది. క్రమంగా ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయబడుతుంది.