పిల్లలారా, మనస్సును ఏకాగ్రము చేయటమే యదార్థ విద్య.

హృదయములో గాని భ్రూమధ్యములో గాని ధ్యానించవచ్చు. ఆసనములో సుఖంగా, సౌక్యంగా కూర్చోగలిగే వరకు హృదయములో ధ్యానించాలి. గురు సాన్నిద్ధ్యములో ఉన్న వారు మాత్రము భ్రూమధ్యములో ధ్యానించుట మంచిది. కారణం, ధ్యానము వలన తల వేడెక్కటము, తలనొప్పి వంటివి రావచ్చు. కొన్ని సందర్భాలలో నిద్ర పట్టకపోవచ్చు. ఈ సందర్భాలలో ఏమి చేయాలో గురువుకి తెలుసు.

అన్ని అస్వస్థతల నుండి రక్షణ పొందేందుకు, మానసికాందోళనలను తగ్గించేందుకు, ధ్యానము సహకరిస్తుంది. ధ్యానము చేయడానికి భగవంతుని పై విశ్వాసము అవసరము లేదు. శరీరములో ఏదైనా ఒక భాగము పైన మనస్సును ఏకాగ్రము చేయవచ్చు. లేకపోతే బిందువునైనా ధ్యానించవచ్చు. తాను అనంతములో లయమవుతున్నట్టుగా భావన చేయవచ్చు. నది సముద్రములో లయమవుతున్న విధముగా.

మన మనస్సు లయము చెందినప్పుడు ఆనందము లభిస్తుంది. అంతేకాని వేరే వస్తువుల నుండి కాదు. ధ్యానము వలన పొందేది ఆనందము ఒక్కటే కాదు. సౌందర్యము, ఆయుష్షు, శక్తి, ఆరోగ్యము, బుద్ధి, ఓజస్సు అన్నీ పొందుతాము. ఏకాంతములో శ్రద్ధతో సరిగా మాత్రము చెయ్యాలి.

ఇష్టరూపాలపై ధ్యానించుట వలన ఏకాగ్రతతో పాటు మనఃశుద్ధి పొందటానికి వీలవుతుంది. ఇష్టమూర్తి యొక్క సాత్విక గుణాలు మనకు తెలియకుండానే వృద్ధి చెందుతాయి. ఊరికే కూర్చున్నప్పుడు కూడా మనస్సును పరిభ్రమించనీయవద్దు. దృష్టి ఎక్కడ పడినప్పటికీ, అక్కడ ఇష్టదేవుడిని భావన చెయ్యాలి.

మీకు దీపముపై ధ్యానించుట ఇష్టమైనట్లైతే అది చాలు. ఒక గదిలో కూర్చుని వెలిగించిన కొవ్వొత్తిని గాని, లేక వేరే చిన్న దీపజ్యోతిని గాని, కొంచెము సేపు చూడాలి. జ్యోతి నిశ్చలంగా ఉండాలి. ఆ జ్యోతిని హృదయంలో గాని, లేక భ్రూమధ్యంలో గాని ధ్యానించవచ్చు. జ్యోతిని చూడటము పూర్తి అయిన తరువాత లోపల స్పష్టంగా కనిపిస్తున్న ప్రకాశములో మనస్సుని ఏకాగ్రము చేయవచ్చు. ఇష్టదేవత జ్యోతిలో నిలుచుని ఉన్నట్లుగా భావన చేస్తూ ధ్యానము చేయవచ్చు. కానీ ఇష్టదేవత హోమాగ్నిలో నిలుచుని ఉన్నట్లుగా భావన చేస్తూ ధ్యానం చేయటము మంచిది. కారణం, అసూయ, అహంకారము మొదలైనటువంటివి హోమాగ్నిలో ఆర్పిస్తున్నట్లుగా భావన చెయ్యవచ్చు.

పిల్లలారా, ధ్యానము చేస్తున్నప్పుడు రూపము పొందటములేదని ధ్యానము ఆపవద్దు. ఇష్టదేవుడి యొక్క ఒక్కో అంగాన్ని పాదాల నుండి క్రమంగా కేశము వరకు లోన భావన చేస్తూ చూడాలి. భగవంతుడికి అభిషేకము చేయండి. అన్ని విధములైన ఆభరణాలతో వస్త్రాలతో అలంకరించండి. ఆహారము ముద్దలు చేసి పెట్టండి. ఈ విధముగా మనస్సులోని భావనల వలన ఇష్టరూపము మనస్సు నుండి చెరిగిపోదు.

మనస్సుని నిర్బంధించి ధ్యానము చేయించటము, తెప్పని నీటి అడుగున పట్టుకుని ఉంచటానికి ప్రయత్నించుట వంటిది. పిల్లలారా, పట్టు వదిలినట్లైతే అది వెంటనే పైకి తేలి రావటము చూస్తాము. ధ్యానించటము సాధ్యము కానట్లైతే జపం చేయండి. జపము ద్వారా మనస్సు ధ్యానానికి అనుకూలము అవుతుంది.

మొదట రూపధ్యానము ఆవశ్యము. దాని మూలంగా ఇష్టదేవుడిలో మనస్సు స్థిరమవుతుంది. ఎందుకు ధ్యానించినా, ఎలా ధ్యానించినా, ఏకాగ్రతే ముఖ్యం. చిరునామా వ్రాయకుండా ఎన్ని రూపాయల స్టాంపులు అతికించి ఉత్తరము పంపించినప్పటికీ ఏమిటి ప్రయోజనము? ఏకాగ్రత లేని జపధ్యానాలు కూడా ఇటువంటివే.

దురాలోచనలను తొలగించటానికి ప్రయత్నించినప్పుడే, అవి వేధించడము మొదలుపెడతాయి. పూర్వం మనము వీటిలోనే ఉన్నప్పుడు, అవి ఇబ్బందికరంగా అనిపించలేదు. వాటి నుండి విభిన్నమైన ఒక భావమే మనకు ఇప్పుడు ఉన్నది. అందుకే వాటి గూర్చి మనకు జ్ఞానము కలిగింది. పూర్వము, అవి ఉన్నప్పటికి కూడా మనకు తెలియదు. ధ్యాన సమయములో ఇటువంటి ఆలోచనలు పైకి వచ్చినప్పుడు, “మనసా, దీని వలన ఏమైనా ప్రయోజనముందా? ఇదంతా ఆలోచించటమేనా నీ లక్ష్యము?” ఈ విధంగా వివేచన చెయ్యాలి. ప్రాపంచిక విషయాల పట్ల పూర్తిగా విరక్తి రావాలి. వైరాగ్యము పెంపొందించుకోవాలి. భగవంతుని పట్ల ప్రేమ రావాలి.

పిల్లలారా, ధ్యానించే సమయములో నిద్ర వస్తుంటే, దానికి లొంగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ సమయములో నడుస్తూ జపము చేయాలి. తమస్సు పోతుంది. ధ్యానము మొదట్లో తమస్సంతా పైకి వస్తుంది. జాగ్రత్తగా ఉంటే క్రమేణా పోతుంది. నిద్ర వస్తున్న సందర్భాలలో మాల తీసుకుని జపము చేయాలి. మాలను చేతిలో ఎత్తి పట్టుకుని ఛాతికి ఆనించి శ్రద్ధతో సావధానంగా జపించాలి. దేనికీ ఆనుకోకూడదు. కాళ్ళు కదపకూడదు.

ఎక్కడ కూర్చున్నా నిలబడినా వెన్నెముకను నిటారుగానే ఉంచాలి. వెన్నెముకను వంచి కూర్చుని ధ్యానించకూడదు. మనస్సు ఒక దొంగ. మనను క్రిందకి తోయటానికి అది అవకాశము కోసము కాచుకుని ఉంటుంది. ఆనుకుని కూర్చుంటే మనకి తెలియకుండానే నిద్రపోతాము.

లోపల రూపము సరిగ్గా స్థిరమవ్వటానికి, కనీసము మూడు సంవత్సరాలైనా కావాలి. మొదట్లో రూపాన్ని చూస్తూ కూర్చుని ఏకాగ్రతకై ప్రయత్నించాలి. పది నిముషాలు కళ్ళు మూసుకుని కూర్చుంటే, తరువాతి పది నిముషాలు కళ్ళు తెరిచి ధ్యాన రూపాన్ని చూస్తూ కూర్చోవాలి. క్రమేణా, రూపము స్పష్టమవుట మొదలవుతుంది.

రాత్రి సమయము వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. పక్షి మృగాదులని, లౌకికమైన జీవనము గడుపుతున్నవారినందరినీ, నిద్ర లోబరుచుకుని ఉంటుంది. అందు మూలంగా వాతావరణములో లౌకికమైన ఆలోచనా తరంగాలు తక్కువగా ఉంటాయి. రాత్రి యొక్క చివరి ఘడియలలోనే పుష్పాలు వికసించేది. వాతావరణానికి అప్పుడు ఒక ప్రత్యేక చైతన్యము ఉంటుంది. ఈ సమయములో ధ్యానిస్తే మనస్సు వెంటనే ఏకాగ్రమవుతుంది. ఎక్కువ సమయము ధ్యానములో మునిగి కూర్చోవటానికి సాధ్యమవుతుంది. యోగులు మేల్కొని ఉండే సమయమే రాత్రి.

ధ్యానము చేసిన మరుక్షణమే మాట్లాడటము, తాను కష్టపడి సంపాదించిన ధనాన్నంతా వేరుశనగలపై ఖర్చు చేయటము వంటిది. ధ్యానము ద్వారా సంపాదించిన శక్తి ఇలా పూర్తిగా వృధా అవుతుంది.

ధ్యానసమయము రూపము అస్పష్టమవుతున్నట్లైతే మళ్ళీ రూపాన్ని భావన చేసి జపమనే పాశముతో ఇష్టదేవుడిని పాదము మొదలుకుని శిరస్సు వరకు బంధించినట్లుగా, అదేవిధంగా తిరిగి విప్పుతున్నట్లుగా భావన చెయ్యాలి. మనస్సుని ఇష్టదేవుడిలో బంధించి ఉంచటానికి ఇది సహాయపడుతుంది.

రూప ధ్యానంలో మనం మనల్నే ధ్యానిస్తున్నాము. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చినప్పుడు నీడ అసలు కనిపించదు. అదే విధంగా రూపధ్యానంలో కూడా. మనంతట మనమే దానిగా (ధ్యాన రూపంగా) మారుతాము. పూర్ణత్వంలోకి చేరుకున్నప్పుడు నీడ లేదు. ద్వంద్వం లేదు, మాయ లేదు.