పిల్లలారా, కోరిక మరియు స్వార్థం నుండే అహంకారముదయిస్తుంది. ఇది సహజంగా జరిగినది కాదు, సృష్టించబడినది.

మనకు రావలసిన బాకీ వసూలు చేయడానికి ఒక చోటుకి వెళ్లామనుకోండి. రెండు వందల రూపాయలు వస్తాయని ఆశించాము. కానీ యాభై రూపాయలు మాత్రమే వచ్చాయి. కోపంతో ఊగిపోతూ వాడిని కొడతాము. ఆ తరువాత కోర్టులో కేసు కూడా అవుతుంది. కోరిన మొత్తము దొరక్కపోవటం వలనే కదా కోపము వచ్చింది. చివరకు కోర్టు వరకు వెళ్ళవలసి వచ్చింది. శిక్ష పడితే భగవంతుడిని నిందించి ప్రయోజనమేమిటి? ఆశించటం వలన కోపము, కోరిక వలన దుఃఖము వచ్చాయి. కోరికల వెనుక పరుగెత్తుటం వలన వచ్చే ఫలితమిదే.

కోరికలు మరియు అహంకార భారము ఉన్నట్లైతే, భగవత్‍కృప అనే గాలి మనల్ని పైకెత్తలేదు. భారాన్ని తగ్గించుకోవాలి.

ఆకులన్నింటినీ రాల్చే వృక్షాలకి చాలా పూలు పూస్తాయి. వేరే చెట్లకు అక్కడక్కడ మాత్రమే. పిల్లలారా, మనలోని స్వార్థము, అహంకారము, అసూయ మొదలైన అన్ని దోషాలు నిశ్శేషమైనప్పుడు పూర్ణమైన భగవత్‍దర్శనము లభిస్తుంది.

సాధకుడికి స్వార్థం లవలేశము కూడా ఉండకూడదు. అది పుష్పాల నుండి మకరందము పీల్చే పురుగుల వంటిది. మకరందాన్ని పీలుస్తున్న పురుగులను అక్కడ పెరగనిచ్చినట్లైతే, పుష్పము పండు అవుతున్నప్పుడు, దానిలో కూడా పురుగులు పడతాయి. ఈ విధంగా ఉన్న కాయల వలన ప్రయోజనం లేదు. అదే విధంగా, స్వార్థాన్ని పెరగనిచ్చినట్లైతే, అది మన సద్గుణాలన్నింటినీ తొలిచి వేస్తుంది.

పిల్లలారా, ఆధ్యాత్మిక జీవికి ఉన్న కోరికలకు మరియు లౌకికునికి ఉన్న కోరికలకు మధ్య ఎంతో అంతరము ఉంది. అలల లాగా ఒకదాని వెనుక మరొకటి వచ్చి కోరికలు లౌకికుడిని బాధిస్తాయి. అతడి కోరికలకు అంతము లేదు. కానీ, ఆధ్యాత్మికాన్వేషికి ఒక్క కోరిక మాత్రమే ఉంది. అది సాధించిన తరువాత అతడిని బాధించటానికి వేరే కోరికలేమీ లేవు.

ఆధ్యాత్మిక జీవి యొక్క స్వార్థం లోకోపకారము. ఒక గ్రామములో, పూర్వము, ఇద్దరు యువకులుండేవారు. అక్కడికి వచ్చిన ఒక సన్యాసి నుండి వారిద్దరికి చెరొక విత్తు లభించింది. మొదటివాడు దాన్ని వేయించి తిని ఆకలి తీర్చుకున్నాడు. వాడు లౌకికుడు. రెండవవాడు, తన గింజను మొలకెత్తించి చాలా ధాన్యాన్ని పండించి ఇతరులకు కూడా ఇచ్చాడు. పిల్లలారా, విత్తును పొందాలన్న స్వార్థం ఇద్దరికీ ఉంది. అయితే, రెండవ వాడి స్వార్థం ఎంతో మందికి మేలు చేసింది!

పిల్లలారా, ఉన్నది ఒక్కటే ఆత్మ. అది సర్వవ్యాపి. మన మనస్సు విశాలమైనప్పుడు మనము దానిలో లయమవ్వగలము. ఆ తరువాత అక్కడ స్వార్థం అహంకారం కనిపించవు. అక్కడ అంతా సమానమే. ఒక్క క్షణము కూడా వృధా చెయ్యకుండా సహాయము చెయ్యండి. ఎవరి నుండీ ఏమీ ఆశించకుండా ఇతరులకు సేవ చెయ్యండి.

చిన్న స్వార్థం ద్వారా పెద్ద స్వార్థాలను తొలగించుకోవచ్చు. వల్లె వేసిన గోడల మీద ‘ప్రకటనలు అంటించరాదు’ అనే ప్రకటన ఉంటే గోడ యొక్క మిగతా భాగం శుభ్రంగా ఉంటుంది. ఇటువంటిదే భగవంతుడు కావాలనుకునే స్వార్థం కూడా.