పిల్లలారా, మీకు జన్మనిచ్చిన తల్లి ఈ జన్మకి చెందిన అవసరాలను చూసుకోవచ్చు. ఈ రోజుల్లో అది కూడా చాలా అరుదు. కానీ ఈ జన్మలోనే కాక భావిజన్మలన్నింటిలోనూ పరమానందప్రాప్తి పొందుటకు సరియైన మార్గమున మిమ్ము నడిపించుటయే అమ్మ లక్ష్యం.

పుండుని చిదిమి చీము తీసేటప్పుడు బాధ కలుగుతుంది. అలాగని నిజమైన వైద్యుడు చీము తీయక మానివేస్తాడా? అదే విధంగా మీ యొక్క చెడు సంస్కారాల్ని తొలగించేటప్పుడు బాధ కలుగుతుంది. అయినా అది మీ మంచికే. అంకురిస్తున్న మొక్కను నాశనం చేసే చీడను తొలగించినట్లుగా అమ్మ మీ చెడు సంస్కారాలను తొలగిస్తుంది.

అమ్మని ప్రేమించుట మీకు తేలికే కావచ్చు. కానీ అది చాలదు. వేరేవారిలోనూ అమ్మని దర్శించుటకు ప్రయత్నించండి. పిల్లలారా, అమ్మ ఈ ఒక్క దేహానికి మాత్రమే పరిమితమని భావించకండి.

పిల్లలారా, అమ్మని ప్రేమిస్తున్నారనటానికి అర్ధం, లోకంలోని సర్వజీవులను సమానంగా ప్రేమించుటయే.

అమ్మ తమ పట్ల ప్రేమను చూపినప్పుడు మాత్రమే అమ్మని ప్రేమించువారిది నిజమైన ప్రేమ కాదు. అమ్మ తిట్టినా తన్నినా కూడా అమ్మ పాదాలను విడువకుండా పట్టుకోగలిగిన వారిదే నిజమైన ప్రేమ.

ఈ ఆశ్రమంలో ఉంటూ అమ్మ యొక్క కార్యాచరణని గమనిస్తూ అర్థం చేసుకుని ముందుకి నడిచేవాడు ముక్తిని పొందగలడు. అమ్మ యొక్క మాటలను తలుచుకుంటుంటె ఇక ఏ ఒక్క ఆధ్యాత్మిక గ్రంధమును చదువవలసిన అవసరం లేదు.

మనస్సుకు ఒక ఆలంబన అవసరం. కానీ విశ్వాసము లేకపోతే అది సాధ్యము కాదు. ఒక విత్తుని నాటినపుడు దాని యొక్క పైపెరుగుదల, భూమి లోపలకి ప్రాకే వేర్ల యొక్క బలంపై ఆధారపడి ఉంటుంది. విశ్వాసము లేకుండా యెదగడం సాధ్యము కాదు.

పిల్లలారా, మీరు అమ్మనో లేక స్వర్గంలో ఉన్న దేవుడ్నో నమ్మాలని అమ్మ చెప్పటం లేదు. మీపై మీకు నమ్మకం ఉంటే చాలు. అంతా మీలోనే ఉంది.

మీరు నిజంగా అమ్మను ప్రేమించినట్లైతే సాధన చేసి మిమ్ము మీరు తెలుసుకోండి. మీనుండి ఏమీ ఆశించకుండానే అమ్మ మిమ్మల్ని ప్రేమిస్తుంది. నా పిల్లలందరూ రేయింబగలు తేడాలేక ఎల్లప్పుడూ శాంతిననుభవించుట చూడగలిగినట్లైతే అమ్మకు అంతే చాలు.

మీరు ఎప్పుడైతే ఒక చీమపట్ల కూడా నిస్వార్ధమైన ప్రేమ కలిగి ఉంటారో, అప్పుడు మాత్రమే మీకు అమ్మ పట్ల నిజమైన ప్రేమ ఉందని అమ్మ భావిస్తుంది. అన్య విధములైన ప్రేమను అమ్మ నిజమైన ప్రేమగా ఎంచదు. స్వార్ధజనితమైన ప్రేమను చూసినప్పుడు అమ్మకి మంటల్లో నుంచున్నట్టు ఉంటుంది.

మీ ఆలోచనలు మరియు చేష్టలకనుగుణంగా అమ్మ స్వభావం మారుతూ ఉంటుంది. రాక్షసరాజైన హిరణ్యకశ్యపుని మీదుకి గర్జిస్తూ దూకిన ఉగ్రనరసింహుడు, తన భక్తుడైన ప్రహ్లాదుని దగ్గర శాంతమూర్తి అయినాడు. పరిశుధ్ధుడు, గుణాతీతుడు అయిన భగవంతుడు, హిరణ్యకశ్యప, ప్రహ్లాదుల వేర్వేరు చర్యల కనుగుణంగా రెండు విరుధ్ధ భావాలను కనబరిచాడు. అదే విధంగా తన బిడ్దల యొక్క భావాలకనుగుణంగా అమ్మ స్వభావం మారుతూ ఉంటుంది. ’స్నేహమయి’ అని బిడ్డలు స్తుతించే అమ్మ ఒక్కొక్కసారి ’క్రూరమయి’గా కనుపించవచ్చు. ఇది నా పిల్లల నడతలోని లోపాలను సరిదిద్దుట కొరకే. వారిని మంచివాళ్ళుగా తీర్చిదిద్దుటే దాని ఉద్దేశ్యము.