కారుణ్యం గలవారు:
ప్రేమ కూడా కలిగి ఉంటారు. ప్రేమ, కారుణ్యం ఒకే నాణెమునకున్న రెండు ముఖాలు.
ఇతరుల పట్ల కారుణ్యం తనలో కలిగినప్పుడు స్వార్ధం దానంతటదే విడిచి పెడ్తున్నదని గ్రహిస్తాడు. ఎలాగైతే ఉప్పు నీటిలో మంచి నీళ్ళు పోస్తున్న కొద్దీ ఆ నీటి ఉప్పదనం మాయమవుతుందో, మంచిని గురింని నిరంతరం ఆలోచించే వానిలో చెడు ధోరణులు మాయమవుతుంటాయి.
ఇతరుల కష్టనష్టాలు తనవిగా భావిస్తాడు. అటువంటి వారి మనస్సు విస్తారమై అంతటా ఐక్యతను చూస్తుంది.
దేహంలో ఒక భాగానికి నొప్పి కలిగితే, శరీరం మొత్తం ఆ నొప్పిని అనుభవిస్తుంది. ఒకే చైతన్యం అంతటా నిండి ఉన్నది కనుక, ఈ సృష్టిలో అతి చిన్నదైన ప్రాణి బాధను కూడా స్వయంగా అనుభవిస్తాడు.
బాధాతప్త మానవాళికి సహాయం అందించడానికి దాన ధర్మాలు చేస్తుంటాడు. మనస్సును ఆ పరమాత్మునికి అర్పించాలని చెప్పబడి ఉన్నది. అయితే మనస్సు ధనం మరియు ఇతర లౌకికమైన వస్తువులలో మునిగి ఉన్నది. లోకోపకారానికై తన ధనంలో కొంత శాతమైనా సరే ఉపయోగించడానికి ప్ర్రయత్నిస్తాడు.
కుష్టు రోగులు వంటి రోగగ్రస్థులను చూసి అతను అసహ్యపడడు. మనస్సును ఇంకా దృఢపరచుకోడానికి అతను అటువంటి వారికి చికిత్స జరుగుతున్న అసుపత్రులకు వెళ్ళి, తనలో నిర్మోహన్ని ఇంకా బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కారుణ్యం జనించినప్పుడు హృదయం మృదువుగా అవుతుంది. తద్వారా మనస్సుకు కూడా ఇది సహకరిస్తుంది.
పేదల పట్ల మనం చూపించే కారుణ్యం నిజానికి ఆ పరమాత్ముని పట్ల మనం చూపించగలిగే బాధ్యత. ఇదే ఆయనకు మనం చెయ్యగలిగే నిజమైన సేవ. నిరుపేదల పట్ల కారుణ్యం చూపించినప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం మనవైపు నిరాటంకంగా ప్రవహిస్తుంది.
ఒక ముష్టివానిపై చూపే కారుణ్యం, ప్రేమ మనకు ఆ పరమాత్మునిపై ఉన్న భక్తికి ప్రతీక.
కష్టాలను అనుభవిస్తున్న వారిని చూసినప్పుడు, ఇలా కష్టాలను అనుభవించడం అతని కర్మ అయితే అతనిపై ప్రేమ చూపిస్తూ అతనికి సేవను అందించడం నా ధర్మం అన్న భావన కలిగి ఉంటాడు.
నిరంతర జపం వల్ల కారుణ్యం మేల్కొంటుందని అతనికి తెలుసు. రామాయణం వ్రాసిన వాల్మీకి మహా ముని, ఒకప్పుడు గజదొంగ, నిరక్షరుడు మరియు సంస్కారం లేని వాడు. తీవ్రమైన ప్రయత్నంతో అయన మునీశ్వరుడు అయ్యాడు. బాధపడుతున్న మానవ జాతికి, తన కారుణ్యం కురిపించి వారికి వరప్రసాదమయ్యాడు. ఇదంతా సాధించగలిగింది అతను చేసిన నిరంతర జపసాధన వల్ల మాత్రమే.
కారుణ్యం అన్నది ఎవ్వరికీ హాని చెయ్యలేని నిరాటంకమైన ప్రవాహం. అహంకారానికి హాని కలిగించే స్వభావం ఉంది. అయితే ప్రేమ ఎప్పుడూ హాని చెయ్యదు. అదే విధంగా కారుణ్యం ఉన్న వారు ఎన్నడూ హాని చెయ్యరు.
మానవజాతి పట్ల ప్రేమ కారుణ్యాలు కలిగి ఉండే మహాత్ముల ఆదర్శాన్ని అనుకరిస్తూ, వారి మార్గదర్శకత్వంలో నడుస్తారు. బుద్ధి పరంగా అర్ధం చెసుకోలేనిది అని తెలుసుకుని ఎల్ల వేళలా ధ్యాననిరతులై గడుపుతారు.
పద్మాసనం వేసుకుని కూర్చున్న వారు, గ్రంథ జ్ఞ్నానం గురించి గర్వ పడేవారు, ధ్యానం మరియు జపం చెయ్యడంలో నేర్పరితనం ఉన్న వారి కంటే కూడా భగవంతునికి అధిక ప్రియమైనవారు కారుణ్యం గలవారు.