ప్రశ్న: అమ్మా, ఎన్నో సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మిక అనుష్ఠానాలు చేస్తున్నప్పటికీ నాకింతవరకు ఎటువంటి అనుభవమూ కలుగలేదెందుకు?

అమ్మ: నాయనా, అమ్మ వద్దకు వస్తున్న చాలా మంది పిల్లలు ఈ విధంగా అమ్మకు చెప్తుంటారు. గృహస్థులైన అమ్మ పిల్లలు కూడా అమ్మకు చెప్తుంటారు, “ఎంతసేపు ధ్యానమూ, జపమూ చేసినప్పటికీ కూడా మాకు ఎటువంటి మేలు కనిపించడం లేదు” అంటూ. పిల్లల్లారా, ప్రార్థనలు చెయ్యడానికిగాను మనం భక్తితో ఆలయాలకు వెళ్తాము, గుడిలో విగ్రహానికి ముమ్మారు ప్రదక్షిణం చేస్తాము. మనం విగ్రహం ముందు నిలబడి ప్రార్థిస్తుండగా మన ముందు ఎవరైనా వచ్చి నిలబడితే వారిపై మండిపోతాము; అప్పటివరకు మనకు లభించిన ఏకాగ్రతవల్ల వచ్చిన ఫలితానికి దాదాపు రె౦డు రెట్లు నష్టపోతాము. గుడినుండి బయటకు వస్తున్నప్పుడు గుడి ముందు బిచ్చమెత్తుకోడానికి కూర్చున్న ముష్టివాడిని కాలితో తన్నడానికి కూడా సందేహించము. ముష్టివానిపై చూపించగలిగే కారుణ్యంవల్లనే ఆలయంలో ఉన్న విగ్రహంయొక్క అనుగ్రహాన్ని సంపాదించేందుకు అర్హతను పొందుతాము. కనుకనే మనకు ఆ అనుగ్రహం లభించదు. అటువంటప్పుడు ఆధ్యాత్మిక అనుభవాలు ఎలా కలుగుతాయి? మారువేష౦లో ఆ పరమాత్ముడు స్వయంగా వస్తే కూడా ఆయనపై కోపగించుకుంటామేమో! ఇలా ఉంటుంది మన స్వభావం. పిల్లల్లారా, అటువంటప్పుడు మనం సాధనయొక్క ఫలితాన్ని ఎలా పొందగలుగుతాము?

నా ముద్దుబిడ్డల్లారా, ఆ పరమాత్ముని చేరే దారి మనసుయొక్క ప్రశాంతతలో ఉంది. మనం ఆ భగవంతునికి చేరువలో ఉండాలంటే, అందరినీ సమానంగా చూడగలగాలి. అందరిపట్లా ఒకేరకమైన ప్రేమను చూపగలిగినప్పుడు మాత్రమే ఆ పరమాత్ముడు మనను స్వీకరిస్తాడు. ఆ పరమాత్మునికి ’పెద్ద’, ’చిన్న’ భావాలు లేవు. ఆయనకి అందరూ సమానమే.

ఈ ప్రపంచంనుండి ఏదైనా పొందాలనుకుంటే, ఎవ్వరి పరామర్శగాని, ఎవ్వరివద్దనుండి పుచ్చుకున్న యోగ్యతాపత్రం యొక్క అవశ్యంగాని లేదు. అయితే ఆ పరమాత్ముని సన్నిధానానికి చేరాలంటే, అందరిముందు తల వంచడానికి సిద్దంగా ఉండాలి, చివరికి ఒక చీమ ముందు సహితం. ఆ పరమాత్మునివద్దకు తీసుకువెళ్ళే ఎన్.ఒ.సి. (No Objection Certificate) సర్టిఫికెట్టు లభించాలంటే చివరికి ఒక చీమ వద్దనుండి కూడా సర్టిఫికెట్టు కావాలి. అప్పుడు మాత్రమే ఆ పరమాత్ముడు మన మనస్సులను ఆత్మతలానికి తీసుకువెళ్తాడు. అలాంటప్పుడు మనకు సమస్త జీవరాశిపట్ల కారుణ్యం మరియు విశాల మనస్సు ఉండి తీరాలి.

పిల్లల్లారా, ప్రతి వ్యక్తీ తాను కల్పించుకున్న విశ్వంలో తాను ఎంతో పెద్దవాడినని భావిస్తాడు. చివరికి ఒక దోమ కూడా అలానే తలుస్తుంది. స్నేహితులైన ఇద్దరు జ్యోతిష్యులు ఉండేవారు. వారి పునర్జన్మ గురించి తెలుసుకోవాలని జ్యోతిష్యపరమైన కొన్ని లెక్కలు కట్టి చూశారు. వారిలో ఒకడు దోమగాను, మరొకడు ఆవుగాను జన్మిస్తారని, వారిద్దరు కలుసుకుంటారని గ్రహించారు. దోమగా పుట్టబోయేవాడు ఆవుగా పుట్టబోయేవాడితో, “వచ్చే జన్మలో మనం కలుసుకున్నప్పుడు, నువ్వు నన్ను కాలితో తొక్కి వెంటనే చంపాలి. అప్పుడు ఆ హీనజన్మనుండి ముక్తి లభించి, ఆ పరమాత్మను వెంటనే చేరుకుంటాను” అన్నాడు.

అతని స్నేహితుడు సరేనని ఒప్పుకున్నాడు. ఇద్దరూ మరణించిన తరువాత అనుకున్నట్లుగా ఒకడు దోమగానూ, మరొకడు ఆవుగానూ జన్మించారు. ఆవుకు తన పూర్వజన్మ గుర్తుంది. చాలా కష్టపడి దోమగా పుట్టిన తన స్నేహితుడు జీవిస్తున్న మురికి కాలువను వెతికి పట్టుకుంది. గత జన్మలో ఒప్పందం ప్రకారం ఆ ఆవు దోమను తన కాలుతో చంపుదామని ముందుకు నడిచింది. ఉన్నట్లుండి ఆ దోమ గట్టిగా రోదించసాగింది, ’ఎంత క్రూరమైన చర్యకు తలపడుతున్నావు?’ అంటూ ఆవుని నిలదీసింది.

’ఈ దోమ జీవితాన్ని జీవించలేనని, ఈ హీనజన్మ నుండి రక్షించమని క్రిందటి జన్మలో నువ్వు నన్ను అడిగావు కదా?’
ఆవు పలికిన ఈ మాటలు విన్న దోమ వెక్కిరింతగా, ’మంచి పరిహాసమే. ఇది హీనమైన బ్రతుకు అంటున్నావా? నాది ఎంత ఆనందమైన, అందమైన జీవితమో నువ్వు గ్రహించగలవా? నాకు ఒక అందమైన భార్య, ముద్దుగొలిపే పిల్లలు ఉన్నారు. ఆ పరమాత్మ సన్నిధానానికి వెళ్ళాలన్న ఆత్రుత నాకు లేదు. అంతే కాదు, ఇంతకంటే గొప్ప లోకం ఉంటుందని నేననుకోవడం లేదు. నేను ఇక్కడే, ఇలాగే జీవితం గడపదలుచుకున్నాను.’ అంది. పిల్లల్లారా, మనలో ప్రతి ఒక్కరివీ ఇటువంటి కథలే.

దోమకు కూడా దాని బ్రతుకు ఎంతో గొప్పది. అదే విధంగా, లౌకిక జీవితంలో మునిగిపోయిన మనము కూడా ఇదే ఉత్తమమైనదిగా భావిస్తుంటాము. మానవ జన్మ ఎత్తిన మృగాలు మాత్రమే లౌకిక జీవితం ఉత్తమమైనదని అనగలరు. పిల్లల్లారా, లౌకిక జీవితం ద్వారా లభించే ఆనందం ఆ దోమకు లభించిన ఆనందంవంటిదే. ఆ పరమాత్ముని శరణుజొచ్చినప్పుడు మాత్రమే జనన మరణాలతో కూడిన ఈ దుఃఖమయ సంసారంనుండి ముక్తిని పొంది, సత్యమైన పరమానందాన్ని చవిచూడగలుగుతాము.