మంత్రాలకు శక్తి లేనట్లైతే, అప్పుడు మాటలకు కూడా శక్తి లేదు. “బయటకు పో” అని కోపంగా చెప్పినదానికి, “దయచేసి బయటకు వెళ్ళండి” అని సౌమ్యంగా చెప్పినదానికి, విన్న వారిలో భిన్న ప్రతిస్పందనలు కలుగుతాయి కదా?

మంత్రము జపించేది మన మనస్సును శుద్ధి చేయటానికి మాత్రమే. అంతే కానీ, మంత్రముతో భగవంతుని తృప్తిపరచేందుకు కాదు. భగవంతునికి మంత్రము ఎందుకు?

మంత్రము జపిస్తే, అది మాత్రం చాలు. అర్థాన్ని గురించి ఆలోచించి తల బద్దలు చేసుకోవలసిన అవసరము లేదు. మీరు ఆశ్రమానికి వచ్చేటప్పుడు బస్సు, కారు, రైలు వంటి వాటిల్లో ఎక్కి కూర్చుంటారు. మీరు ఆ వాహనము గురించి ఆలోచిస్తూ సమయము వృధా చేసుకోరు కదా. లక్ష్యాన్ని గురించిన జ్ఞానమున్నవాడు అయితే చాలు.

మంత్రదీక్ష పలు రీతులుగా ఉంది. నయన దీక్ష, స్పర్శ దీక్ష, సంకల్ప దీక్ష, మంత్రోపదేశము ఈ విధంగా. మంత్రము వ్రాసి ఇవ్వటములో తప్పు లేదు. అయితే, మంత్రము ఉపదేశించినాక శిష్యుని యొక్క సకల భారాలు గురువివే. యథార్థ గురువు నుండే మంత్రోపదేశము స్వీకరించాలి. యథార్థ గురువు కానట్లైతే, నీటిని శుద్ధి చేయటానికి మురికిగా ఉన్న ఫిల్టరును ఉపయోగించటము లాగా ఉంటుంది. నీరు మరింత చెడిపోతుంది.

పిల్లలారా, బస్సులోకి ఎక్కి టిక్కెట్టు తీసుకున్నాను కదా అని అశ్రద్ధగా ఉండకూడదు. దానిని సురక్షితంగా ఉంచుకోవాలి. టిక్కెట్ కలక్టర్ వచ్చినప్పుడు చూపించకపోతే, దింపి వేస్తాడు. అదే విధంగా, మంత్రము దొరికిందని చెప్పి అంతా అయిపోయిందని అనుకోవద్దు; ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగించినప్పుడు మాత్రమే అది మిమ్మల్ని చేర్చవలసిన స్థలానికి చేరుస్తుంది.