మనకు అవసరమున్న వస్తువులన్నీ ఉన్న దుకాణమేదో తెలిసిన తరువాత, పిల్లలారా, బజారులో ఉన్న అన్ని దుకాణాల్లో తిరుగుట ఎందుకు? దాని వలన ఉపయోగం లేకపోగా సమయం కూడా వృధా అవుతుంది. అదే విధంగా, మనకు గురువు లభించినట్లైతే ఇక వృధా సంచారాన్ని చాలించి, గమ్యం చేరుటకు శ్రమిస్తూ సాధన చేయాలి.

సాధకుని దగ్గరకు గురువు తానే వస్తాడు. అన్వేషించవలసిన అవసరం లేదు. సాధకుడు అటువంటి వైరాగ్యమున్నవాడు మాత్రం అయ్యుండాలి.

ఒక సాధకునికి గురువు తప్పకుండా అవసరము. బిడ్డ కొలను అంచుకు వెళ్ళినట్లైతే తల్లి అపాయన్ని చూపించి, అక్కడి నుంచి వెనక్కి తిరిగేలా చేస్తుంది. అదేవిధంగా, గురువు, శిష్యునికి అవసరమైన రీతిలో మార్గనిర్దేశం చేస్తూ ఉంటాడు. గురువు దృష్టి ఎల్లవేళలా శిష్యునిపై ఉంటుంది.

పరమాత్మ సర్వవ్యాపకుడైనప్పటికిని, గురువు యొక్క సన్నిధి విశిష్టమైనది. అంతటా గాలి వీస్తున్నప్పటికిని, చెట్టుక్రింద కూర్చున్నప్పుడు ఉన్న చల్లదనం వేరే చోట ఉండదు. చెట్ల ఆకుల నుండి వస్తున్న గాలి, మండుటెండలో ఉన్న మనకి చల్లదనాన్ని ఇవ్వటం లేదా? అదే విధంగా ప్రాపంచిక జీవితంయొక్క వేడిలో ఉన్న మనకు గురువు యొక్క అవసరమున్నది. గురువుయొక్క సన్నిధి మనకు అంతఃశాంతి మరియు సామరశ్యాన్ని కలిగిస్తుంది.

పిల్లలారా, మలము ఎంతకాలము ఎండలో ఉన్నప్పటికీ, దుర్గంధం పోవాలంటే దాని పై నుండి గాలి వీయాలి. ఇదే విధంగా, అనేక సంవత్సరాలపాటు ధ్యానం చేసినప్పటికీ, చెడు సంస్కారాలు తొలగింపబడాలంటే గురువు సాన్నిధ్యంలో జీవించాలి. గురుకృప ఆవశ్యకము. నిష్కళంకమైన మనస్సుకు మాత్రమే గురువు కృపని అనుగ్రహిస్తాడు.

ఆధ్యాత్మికంగా పురోగమించుటకు, గురువు పట్ల మనం పూర్తి ఆత్మార్పణ భావం కలిగి ఉండాలి. ఒక బాలుడు అక్షరం నేర్చుకునేటప్పుడు, ఉపాధ్యాయుడు అతని వేలు పట్టుకొని ఇసుకలో ఆ అక్షరాన్ని వ్రాయిస్తాడు. బాలుని వేలు యొక్క కదలిక పూర్తిగా ఉపాధ్యాయుని నియంత్రణలో ఉంటుంది. కానీ ఆ బాలుడు ’నాకంతా తెలుసు’ అనే భావనతో, ఉపాధ్యాయుని మాట వినటానికి నిరాకరిస్తే, ఏ విధంగా నేర్చుకోగలడు?

పిల్లలారా, స్వానుభవమే ప్రతి వ్యక్తికీ నిజమైన గురువు. దుఃఖమే మనల్ని భగవంతునికి సమీపంగా తీసుకొనివెళ్ళే గురువు.

గురువు పట్ల శిష్యుడు భయభక్తులు కలిగి ఉండాలి. అదే సమయంలో గురువు నా స్వంతమే అన్నంత సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. తల్లి ఎంత కొట్టినా, దూరంగా త్రోసివేసినా కూడా బిడ్డ తల్లిని కరచుకొని ఉండేటటువంటి బంధంలాగా ఉండాలి అది. భయభక్తులు మన ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడతాయి. కానీ నిజమైన మేలు గురువుతో ఉన్న సన్నిహిత సంబంధం ద్వారానే పొందగలము.

పిల్లలారా, మీరు మీ గురువుని ప్రేమించినంత మాత్రం చేత మీ వాసనలు నశించవు. మీరు ఆధ్యాత్మిక తత్వాలపై ఆధారపడినటువంటి భక్తివిశ్వాసములు కలిగి ఉండుట అవసరము. వాటిని అభివృద్ధి పరచుకునేందుకు దేహ, మనో, బుద్ధులను అర్పణ చేయుట అవసరము. గురువుపట్ల సంపూర్ణ భక్తి, విధేయతలను పెంపొందించుకున్న చాలు, అదే వాసనలను తొలగిస్తుంది.

నిజమైన గురువులు శిష్యునియొక్క ఆధ్యాత్మిక ప్రగతిని మాత్రమే ఆశిస్తారు. పరీక్షలు శిష్యుని అభివృద్ది కొరకే. అతనిలో ఉన్న బలహీనతలను తొలగించటనికే. శిష్యుడు చేయని తప్పులకు కూడా గురువు అతనిని నిందించవచ్చు. అటువంటి పరీక్షలను నిశ్చలంగా భరించగలిగిన వారు మాత్రమే పురోగమించగలరు.

నిజమైన గురువుని అనుభవము ద్వారా మాత్రమే తెలుసుకోవడం సాధ్యం.

కృత్రిమంగా పొదుగబడిన కోడిపిల్లలకు సరియైన ఆహార, వాతావరణాలు కల్పించకపోతే చనిపోతాయి. కానీ నాటు కోడిపిల్లలు ఆహార, వాతావరణాలు ఎలా ఉన్నా బ్రతుకుతాయి. పిల్లలారా, సద్గురు సన్నిధిలో జీవించే సాధకుడు ఈ నాటు కోడిపిల్లల వంటి వారు. వారు ఎటువంటి పరిస్థితినైనా అధిగమించుటకు ధైర్యము కలిగి ఉంటారు. ఏదీ వారిని లోబరుచుకోలేదు. సద్గురు సన్నిధిలో జీవించిన సాధకులు ఆ సాన్నిహిత్యం నుండి పొందిన శక్తిని ఎల్లవేళలా కలిగి ఉంటారు.

ఒక శిష్యుడు తన గురువుపట్ల స్వకీయమైన వైఖరి కలిగి ఉండవచ్చు. ఈ వైఖరి అంత సులభముగా నశించదు. ఒక శిష్యుడు తన గురువుయొక్క అత్యున్నత ప్రేమను తను మాత్రమే పొందాలని ఆశించవచ్చు. అది పొందటంలేదని అనిపించినప్పుడు, గురువుని దూషించి విడిచిపెట్టి పోయే శిష్యులు కూడా ఉన్నారు. గురుప్రేమ కావాలనుకుంటే నిస్వార్ధంగా సేవచేయటం నేర్చుకోవాలి.

భగవంతుని ఉగ్ర కోపమును శమింపజేయవచ్చును. కానీ గురు నింద ద్వారా వచ్చిన పాపాన్ని భగవంతుడు కూడా క్షమించడు.

గురువు, దేవుడు అందరిలోనూ ఉన్నారు. కానీ సాధన యొక్క ఆరంభదశలలో బాహ్య గురువు అవసరము. ఒక స్థాయిని చేరిన తరువాత దాని అవసరము ఉండదు. ఆ తరువాత ప్రతి ఒక్క వస్తువు నుండి ముఖ్యమైన ఆధ్యాత్మిక తత్వాలను గ్రహిస్తూ తమంతట తాముగా ముందుకు సాగగలరు. ఒక బాలుడు లక్ష్యబోధం కలిగేంతవరకు ఇంట్లోనివారు మరియు ఉపాధ్యాయుల భయం వల్లనే పాఠాలు చదువుతాడు. ఒక్కసారి లక్ష్యబోధం కలిగిన తరువాత, సినిమాలు చూడకుండా, నిద్రపోకుండా, కూర్చుని చదువుతాడు. అంత వరకూ తన ఇంట్లోనివారి పట్ల ఉన్న భక్తి అతని బలహీనత కాదు. పిల్లలారా, లక్ష్యబోధం కలిగినప్పుడు, అతనిలో ఉన్న గురువు కూడా తనంతట తానే మేల్కొంటాడు.

ఒక వ్యక్తి గురు సన్నిధిలోకి వచ్చినప్పటికీ, అర్హత కలిగిఉన్నట్లైతేనే గురువు అతడిని స్వీకరిస్తాడు. కానీ గురుకృప లేకుండా ఎవరూ గురువుని తెలుసుకోలేరు. సత్యాన్వేషి వినయము, నిష్కపటత్వం కలిగి ఉంటాడు. అటువంటి వానిపై మాత్రమే, గురువు, కృపని అనుగ్రహిస్తాడు. అహంభావంతో గురువుని సమీపించేవాడు గురువుని ప్రాప్తించుకోవటం సాధ్యము కాదు.

పిల్లలారా, ’భగవంతుడు, నేను ఒక్కటే’ అని అనవచ్చు. కానీ, ఒక శిష్యుడు ’గురువు, నేను ఒక్కటే’ అని ఎన్నటికీ అనలేడు. ’నాలో నేను’ మేల్కొలిపినవాడు గురువే కదా. ఆ అనుపమానమైన మహత్వం ఎప్పుడూ ఉంటుంది. శిష్యుని నడవడి దానికి అనుగుణంగా ఉండాలి.

ఎగురలేని తన కోడిపిల్లలను తల్లికోడి ఏ విధంగా తన రెక్కల క్రింద ఉంచి రక్షిస్తుందో అదే విధంగా సద్గురువు కూడా తన నియంత్రణలో నడచువారి పూర్తి సంరక్షణ వహిస్తాడు. శిష్యుల యొక్క అతి చిన్న పొరపాట్లను కూడా అప్పటికప్పుడే ఎత్తిచూపి వాటిని సరిదిద్దుతాడు. తన శిష్యులలో రవ్వంత కూడా అహాన్ని పెరుగనివ్వడు. అందుకోసం గురువులు ఒక్కొక్కసారి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించవచ్చు.

వేడెక్కిన ఇనుపముక్కని తన సమ్మెటతో కొడుతున్న కంసాలిని చూచిన జనం అతడు నిర్దయుడని అనుకోవచ్చు. ఆ ఇనుపముక్క కూడా వీడంత క్రూరుడు మరొకడుండడని అనుకోవచ్చు. కానీ ప్రతి దెబ్బ కొడుతున్నప్పుడు ఆ కంసాలివాని దృష్టి, దాని వలన వెలువడే కొత్త రూపంపైన మాత్రమే ఉంటుంది. పిల్లలారా, నిజమైన గురువు కూడా అటువంటివాడే.