“కృష్ణ భగవానుడు చేసింది తప్పు కాదా?” అని మనం అనుకోవచ్చు. భగవంతుడి ఏకైక ధ్యేయం ధర్మాన్ని రక్షించడమే అన్నది మనం విస్మరించకూడదు. ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఏది మంచో, ఏది చెడో మనం తీర్పు చెప్పలేం. ఆ సందర్భానికి దారి తీసిన పరిస్థితులని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. దుర్యోధనుడి ప్రోద్బలంతోనే పాంచాలి వస్త్రాలని నిండు సభలో ఊడదీసే ప్రయత్నం జరిగింది. ఇది జరిగేప్పుడు ఆనందంగా తన తొడలని కొట్టుకున్న దుర్యోధనుడు ఆ అధర్మ కార్యానికి భాగస్వామి అయ్యాడు. దాంతో “దుర్యోధనుడు కొట్టుకున్న తొడలని విరొగ్గొట్టి, అతడిని చంపుతాన”ని భీముడు ప్రతిజ్ఞ చేసాడు. దీని ద్వారా నేరంలో భాగస్వామి అయిన వాడు, దాన్ని ఆనందించేవాడు, వెంటనే కానీ, ఆలస్యంగా కాని దానికి సరైన ఫలితాన్ని పొందుతాడని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేసాడు. అంతేకాక ఈ సంఘటన వలన అధర్మాన్ని వ్యతిరేకించే వారి ప్రతిజ్ఞ నెరవేరడానికి భగవానుడు సహాయం చేస్తాడని కూడా తెలుస్తోంది.

దీన్నించి మనం అర్ధం చేసుకోవాల్సింది ఇంకోటుంది. దుర్యోధనుడు భుజబలుడు, శాస్త్రాలని బాగా చదివినవాడు (అయితే అతని చర్యలు అతని విద్యని ఎన్నడూ ప్రతిఫలించలేదు) యుధ్ధ విశారదుడు. గదాయుధ్ధంలో తొడ మీద కొట్టడం నిషిధ్ధం. తన తల్లి దగ్గరకి వెళ్ళే దుర్యోధనుడ్ని శ్రీకృష్నుడు అతని తొడలని కప్పుకుని వెళ్ళమని సూచిస్తే అతను సందేహించకుండా తన నడుం చుట్టూ బట్టని కప్పుకుని వెళ్ళాడు. ఈ పొరపాటే అతని ఓటమికి, చివరికి మరణానికి కారణభూతమైంది. ఒక్కోసారి మనం ప్రాముఖ్యత లేనివిగా అనుకుని విస్మరించే చిన్న విషయాలే మన పెద్ద అపజయాలకి కారణాలవుతాయి. చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండటానికి మనకి దేవుడి కృప కావాలి. గతంలో మనం చేసిన సుకర్మల ఫలితంగానే మనకా కృప అందుతుంది. మనం ఎంత నైపుణ్యంగలవారమైనా అందుకు గర్వించకూడదు. మన మీదకి ఎటు నించి ఏ ప్రమాదం వచ్చి పడుతుందో ఎవరూ చెప్పలేరు. పైన ఉదహరించిన సంఘటన నించి మనం ఇలాంటివి చాలా నేర్చుకోవచ్చు. అన్నిటి కన్నా ఒక్క భగవానుడి కృప వల్ల మాత్రమే భీముడు దుర్యోధనుడ్ని ఓడించగలిగాడు. భీముడు గొప్ప బలశాలే. కాని చివరికి అతని బలం కాని, సమర్ధత కాని అతను గెలవడానికి ఏం సహాయం చేయలేకపోయాయి. కృష్ణ భగవానుడి సూచనలని అనుసరించబట్టే భీముడు గెలిచాడు. భగవానుడి మీద శరణాగత భావం ఉండటంతో భీముడు ఆయన కృపని పొందాడు.

దుర్యోధనుడిలోని బలహీన భాగాన్ని మూడో వ్యక్తికి కృష్ణుడు తెలియజేయడం సరైనదేనా? గదా యుద్ధంలో తొడల మీద కొట్టడాన్ని యుధ్ధ నియమాలు నిషేధించాయి కదా? కానీ భీముడికి ఆ అనుమానం రానేలేదు. భగవానుడు చెప్పాడు. అంతే. ఆయనకి తగిన కారణం ఉంటుంది, ఆయన ఎన్నడూ తప్పు చేయడు, ఆయనకి విధేయతగా ఉండటం ఒక్కటే తన బాధ్యత అనుకున్నాడు. ఈ శరణాగత లక్షణమే భీముడి విజయానికి దారి తీసింది. ఒక వేళ ఈ విషయం శ్రీకృష్ణుడు యుద్ధానికి ముందు చెప్పి ఉంటే, భీముడు అది యుద్ధ నియమాలకి వ్యతిరేకం కాబట్టి, దాన్ని పాటించడానికి ఇష్టపడి ఉండేవాడు కాదేమో? అంతే కాక, భీముడికి తన శక్తి మీద గొప్ప నమ్మకం ఉంది. కాని సమర్ధతే విజయానికి దారి తీయదని అతను పడ్డ కష్టాల వల్ల అతనికి అర్ధమైంది. అలాంటి పరిస్థితుల్లో అతనిలో శరణాగత దృక్పధం ఉదయించింది. ఫలితంగా భగవానుడి కృప అతని వైపు ప్రవహించింది. లెక్కలేనన్ని సార్లు భగవానుడు దుర్యోధనుడికి ధర్మ మార్గాన్ని చూపించాడు కాని, అతను దాన్ని పాటిండానికి సిద్ధంగా లేడు. దీని తప్పనిసరి ఫలితాలు ప్రపంచం సర్వనాశనం అవడానికి కారణం అయ్యేవి. దుర్యోధనుడ్ని నశింపచేయడం ద్వారానే ప్రపంచాన్ని రక్షించవచ్చని కృష్ణ భగవానుడికి తెలుసు. మనం మహాభారత యుద్ధంలో ఇదే చూస్తాం. అధర్మం మీద ధర్మం గెలుపు.

“కృష్ణ భగవానుడు ఇదంతా ఎందుకు చేశాడు?” అనే ప్రశ్నకి ఒకే సమాధానం ఉంది – ధర్మాన్ని రక్షించడానికి. ఆయనకి నిర్వర్తించడానికి బాధ్యతలు లేవు. తను చేస్తున్నానన్న భావనా లేదు. మనం భగవంతుడికి శరణాగతి చెందడాన్ని అభివృద్ధి చేసుకుంటే, అప్పుడు మనం ఆయన చేతుల్లో పరికరాలం అవుతాం. మనకి తెలియకుండానే ఆయన కృప మనలోకి ప్రవహిస్తుంది. ఇక్కడే విజయం కూడా ఉండేది.

మన మనసులు అపరిపక్వంగా ఉన్నంత సేపు ధర్మాధర్మాల మధ్య గల విచక్షణని తెలుసుకుంటూ ముందుకు సాగడం కష్టం. ఆందుకు మనలోని స్వార్ధమే మొదటి అడ్డంకి అవుతుంది. తరచుగా మనం చెడు చేయకుండా కాపాడేది, మనలో గల భయభక్తులే. దేవుడి మీద భయంతో కూడిన భక్తి, దైవ నియమాలని అతిక్రమిస్తే కలిగే ఫలితాల మీద భయం మనల్ని చెడు చేయకుండా కాపాడుతుంది. అమ్మకి తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తుంది.

“నేను విద్యార్ధినిగా ఉండగా, స్కూల్ ఆవరణలో ఇంటికి వెళ్తుంటే నాకు ఓ పెన్సిల్ కనిపించింది. ఆ సాయంత్రం నేను స్కూల్ నించి ఇంటికి తిరిగి వచ్చాక దమయంతి అమ్మ ఆ పెన్సిల్ ని చూసింది. దాన్ని నేను ఎలా సంపాదించానో చెప్పమని నిలదీస్తూ అమ్మ నన్ను అనేక సార్లు కొట్టింది. నేను స్కూల్ నించి వచ్చేప్పుడు దాన్ని చూసానని, తెలిసి దొంగిలించలేదని చెప్పినా, మా అమ్మ నన్ను కొట్టడం, తిట్టడం ఆపలేదు. ’అది ఎవరిదో, ఇతరులనించి తెలుసుకోకుండా నువ్వా పెన్సిల్ ని తీసుకుని సరాసరి ఇంటి కొచ్చావు. అది పచ్చి దొంగతనం’ అని తిడుతూ నన్ను కొట్టింది. మన తల్లులు మనం బాల్యంలో చేసే చిన్న పొరపాట్లకి కూడా ఇలా మనల్ని శిక్షిస్తేనే మనం పెద్దయ్యాక పెద్ద నేరాలని చేసే ధైర్యం చేయం.”

భగవద్భక్తులు తప్పు పనులు చేయకుండా దూరంగా ఉండటానికి భయభక్తులు శక్తినిస్తాయి. శిక్ష పడుతుందనే భయం, సమాజం తనని ఎలా చూస్తుందో అనే భయం మనిషి తప్పు చేయకుండా అడ్డుపడతాయి. పోలీసుల ఉనికే చాలా మంది నేరాలని చేయకుండా అడ్డుపడుతుంటుంది. తప్పు చేస్తే కలిగే ఫలితాలని గురించి ఆలోచిస్తే, మనం అలాంటి తప్పులు చేయకుండా ఉంటాం. మనలోని చాలామంది అలాంటి వాళ్ళే. వందమందిలో ఐదుమంది మాత్రమే తప్పు ఒప్పుల విచక్షణా జ్ఞానం కలిగి ఉండొచ్చు. మిగిలిన వారు శిక్ష పడుతుందనే భయంతో నేరాలకి దూరంగా ఉంటారు. మనం తప్పొప్పుల విచక్షణతో జీవించాలనుకుంటే, మహాత్ముల జీవితాలనించే నేర్చుకోవడం ఉత్తమ పద్ధతి. ప్రతి సందర్భంలో వారు ఎలా మసలుకున్నారో అన్న దాని నించి నేర్చుకోవచ్చు. వారి నించి మనం నేర్చుకోడానికి చాలా పాఠాలుంటాయి. వారెన్నడూ తమ కోసం జీవించలేదు. ఇప్పుడు కూడా వారు తమ కోసం జీవించడం లేదు. వాళ్ళ లక్ష్యం అంతా ధర్మాన్ని రక్షించి, సమాజానికి మంచి చేయాలన్నదే. పక్క దారి పట్టకుండా, మన గమ్యాన్ని చేరడానికి తేలిక మార్గం, వారిని అనుసరించడమే.